
Babu Pawan alliance : టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగు రాష్ర్టాల రాజకీయ నాయకుల్లో సీనియర్ నేత. 14 ఏండ్లు ముఖ్యమంత్రిగా తనదైన పేరు సంపాదించుకున్నారు. అడ్మినిస్ర్టేషన్ పై మంచి పట్టున్న లీడర్ గా చంద్రబాబుకు పేరుంది. అయితే కొంతకాలంగా ఆయన గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా ఆయన కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికోసం జనసేన, బీజేపీతో పొత్తుతో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ పొత్తుల విషయంలో ఆయన కొంత సంశయంతో ఉన్నట్లు కనిపిస్తు్న్నది.
పవన్ తో ఈ ఎన్నికల్లో పొత్తుతో ముందుకెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గం ఓట్లతో పాటు టీడీపీ కి గత ఎన్నికల్లో దూరమైన యువతను దగ్గర చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. జనసేనతో పొత్తు తో ముందుకెళ్తే కాపు ఓట్లు మెజార్టీగా మళ్లే అవకాశం ఉంటుంది. అయితే మరి బీసీల ఓట్లు ఎలా పడతాయనేది ఇప్పుడు చంద్రబాబుకు భయం పట్టుకుంది. ముందు నుంచి బీసీల పార్టీగా టీడీపీగా పేరుంది. వారిని దూరం చేసుకుంటే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.
ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ బీసీలను మచ్చిక చేసుకునే పనిలో పడింది. ఇప్పటివరకు రెడ్డిల పార్టీ గా వైసీపీ పై ముద్రపడింది . దానిని దూరం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీసీల ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. కమ్మ, కాపుల ఓట్లు ఈ సారి కొంత దూరమవుతాయని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఎలాగైనా గెలిచి, రెండో సారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు పీకే టీం ద్వారా గ్రౌండ్ లెవల్ పరిస్థితిని తెప్పించుకుంటున్నారు. ఇంటలిజెన్స్ టీం కూడా జగన్ కు తాజా పరిస్థితిని చేరవేస్తున్నది.
దీంతో పవన్ తో కలిస్తే టీడీపీకి లాభం చేకూరుతుందా.. లేదా అని చంద్రబాబు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని సమాచారం. పొత్తులపై ఎలాంటి టాక్ బయటకు వస్తున్నదని ఆయన కూపీ లాగుతున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా బీసీల ఓట్లు వైసీపీ వైపు మళ్లకుండా చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా పవన్ తో పొత్తు టీడీపీకి కలిసివస్తుందా.. లేదంటే నష్టం చేస్తుందా అనేది త్వరలోనే తేలిపోనుంది.
అధికారంలో ఉన్న వైసీపీని బలంగా ఢీకొట్టాలంటే పవన్ సాయం అవసరమని భావించే ముందుగా పొత్తులకు అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితులు చంద్రబాబును ఆలోచనలో పడేశాయి. కాపు ఓట్లను టార్గెట్ చేసుకుంటూ పవన్ వెళ్తుండగా, ఈ క్రమంలో ఆయనకు దగ్గరయితే బీసీల నుంచి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆయన ప్రస్తుతానికి పొత్తులు ఉంటాయని, ఉండవని లాంటివి మాత్రం ప్రకటించడం లేదు.
కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటూ ఇటు చంద్రబాబు.. అటు పవన్ చెబుతున్నారు. మధ్యస్థంగా మరేదైనా వ్యూహంతో ముందుకెళ్తున్నారా అనేది కూడా ఆ ఇరువురు నేతలకే తెలియాలి. మరి చంద్రబాబుకు పవన్ ప్లస్సా.. మైనస్సా అనేది రానున్న కాలమే నిర్ణయిస్తుంది. ఎన్నికలకు మరో తొమ్మిది నెలల గడువు మిగిలి ఉంది. ఈ లోగా ఎలాంటి రాజకీయ చిత్రాలు తెరపైకి వస్తాయో చూడాలి.