Congress : కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ వేడి రగులుకుంది. తెలంగాణకు ద్రోహం చేశారంటూ రెండు పార్టీలు పరస్పరం పోట్లాడుకుంటున్నాయి. దీంతో ఉత్తర తెలంగాణ కంటే దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందనే వాదన తీసుకొస్తోంది. బీఆర్ఎస్ విధానాల వల్ల దక్షిణ తెలంగాణ తీవ్ర దుర్భిక్షంగా మారిందని అంటున్నారు. కాళేశ్వరం లాంటి పథకం దక్షిణ తెలంగాణకు లేకపోవడం గమనార్హం.
దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో పాలమూరు జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా నిర్లక్ష్యం వహించారని చెబుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. దీనిపై కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు బీఆర్ఎస్ ను బలిపశువులను చేయాలని చూస్తున్నారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం పని రాష్ట్ర పునర్విభజన నాటికి 30 కిలోమీటర్లు పూర్తయింది. గత ఐదేళ్లలో ఒక కిలోమీటర్ మాత్రమే పూర్తి చేశారు. పాలమూరు-రంగారెడ్డికి ఇంతవరకు రూ. 30 వేల కోట్లు ఖర్చు చేసినా ఇంతవరకు ఎకరానికి కూడా నీరు రాలేదు. కాళేశ్వరంకు రూ. లక్షల కోట్లు ఖర్చు చేసినా లాభం లేకుండా పోయింది.
వీటిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల నోట్లో మట్టి కొట్టి పర్సంటేజీలు తీసుకుని పక్కన పెట్టారు. దీని వల్ల ప్రజాధనం పనికి రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించి వారి చేతగాని తనాన్ని ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అసెంబ్లీ వేదికగా బాధ్యులుగా చేస్తూ విమర్శలు చేయాలని అనుకుంటున్నారు.