amaravati అమరావతి రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో ఆర్ 5 జోన్ లో పేదలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఈ నెల 24 సీఎం జగన్ టూర్ ఖరారైంది. ఇందుకోసం అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. అయితే ఇదే వివాదంపై ప్రస్తుతం హైకోర్టులో కేసు విచారణలో ఉంది. ఇటీవల న్యాయస్థానం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు కూడా వేసింది. అయితే విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వులో ఉంచింది.
రాజధాని అమరావతిలో పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ, ఇంటి నిర్మాణ వ్యవహారంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నది. సీఎం జగన్ ఈనెల 24న అమరావతిలో పర్యటించనున్నారు. ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. గతంలోనే వైఎస్ జయంతి సందర్భంగా కార్యక్రమం జరగాల్సి ఉండగా, పలు కారణాలతో వాయిదా పడింది. ఇక సోమవారం(24న) సీఎం జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు
అయితే ఈ విషయంలో హైర్టులో పలు పిటిషన్లు విచారణలో ఉన్నాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తుదితీర్పును రిజర్వులో ఉంచింది. అయితే తీర్పు ఇవ్వకుముందే పట్టాల పంపిణీ, ఇతర పనుల విషయంలో ఎలా ముందుకెళ్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రజా ధనం వృథా కాకుండా ఎలా చూస్తారని ప్రశ్నించింది. అయితే రైతుల హక్కులను కాలరాసి, పేదల సంక్షేమం అంటూ అమరావతి మాస్టర్ ప్లాన్ ను చంపేసే కుట్రకు జగన్ ప్రభుత్వం ప్లాన్ చేసిందని పిటిషనర్లు వాదించారు. ల్యాండ్ పూలింగ్ కింద సేకరించిర న భూముల విషయంలో ప్రభుత్వానికి పూర్తి హక్కులు రాలేదని కోర్టుకు నివేదించారు. అయితే గత ప్రభుత్వం 1656 ఎకరాలు ఇతర ప్రైవేట్ సంస్థలకు కేటాయించిందని, అప్పుడూ ఎవరు అడ్డుచెప్పలేదని పేర్కొన్నారు. ఇక తీసుకున్న భూమిలో కేవలం 5శాతం మాత్రమే పేదల ఇండ్లకు కేటాయిస్తున్నామని, ఇది మాస్టర్ ప్లాన్లో లేదని ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్పుకొచ్చారు. అయితే వ్యతిరేకంగా తీర్పు వచ్చినా నిర్మించిన ఇండ్లను అలాగే ఉంచుతామని, ప్రజాధనం వృథా కానివ్వమని చెప్పారు. అయితే ఏదేమైనా అమరావతి ఇండ్ల విషయంలో జగన్ మరింత మొండిగా ముందుకెళ్లాలనే భావిస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అమరావతి రాజధాని నిర్ణయాన్ని ఆయన పక్కన పెట్టేశారు. మూడు రాజధానులు అంటూ తెరపైకి తెచ్చారు. కానీ ఇప్పటికీ ఏపీకి ఏది రాజధాని అనే విషయాన్ని తేల్చలేకపోయారు. టీడీపీ కి మంచి చేసే ఏ నిర్ణయాన్ని ఆయన స్వాగతించరు సరే. మరి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా మరింత కటువుగా వ్యవహరించడం సరికాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ర్ట భవిష్యత్ ను ఇబ్బంది పెట్టేలా జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు సర్వతా విమర్శల పాలవుతున్నది. అమరావతి రాజధాని విషయంలో ఇప్పటికీ అన్ని పార్టీలు కట్టుబడి ఉంటే, నాడు ఒకే అన్న జగన్, నేడు దానిపై కుట్రలకు తెరదీశారని అపవాదు వస్తున్నా వెనక్కితగ్గడం లేదు. ఒక్క వైసీపీ లోని కొందరు నేతలు మినహా అందరూ జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.