Pawan Janasena : ఏపీ ఎన్నికలు దగ్గరకొస్తుండడంతో టీడీపీ, జనసేన సీట్ల పంపకాలపై తుది కసరత్తు జరుగుతోంది. ఎన్నికల్లో గోదావరి జిల్లాలు కీలకం అనేది మనకు తెలిసిందే. కాపులు ఓట్లు అత్యధికంగా ఉన్న ఈ జిల్లాల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే సీట్లపైన టీడీపీ దాదాపు నిర్ణయం తీసుకుంది. బీజేపీతో పొత్తు ఖాయమని చెబుతున్నా.. తుది నిర్ణయం రావాల్సి ఉంది. ఈ సమయంలో గోదావరి జిల్లాల్లో టీడీపీ కేటాయించిన సీట్లను పవన్ ఆమోదిస్తారా.. మరిన్ని సీట్ల కోసం పట్టుబడుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
తూర్పు గోదావరి జిల్లాలో 19 స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ 4, జనసేన 1, వైసీపీ 14 స్థానాలను గెలుచుకుంది. ఈసారి టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా అక్కడ నుంచి మెజార్టీ సీట్లు ఇవ్వాలని పవన్ ప్రతిపాదించారు. తూర్పు, పశ్చిమ గోదావరితో పాటు విశాఖ పట్టణం జిల్లాలో పవన్ మెజార్టీ స్థానాలు కోరుతున్నారు.
తూర్పు గోదావరిలోని 10 స్థానాల్లో అభ్యర్థులపై టీడీపీకి పూర్తి క్లారిటీ వచ్చింది. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య- తుని, వరుపుల సత్యప్రభ- ప్రత్తిపాడు, నిమ్మకాయల చినరాజప్ప- పెద్దాపురం, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి-అనపర్తి, బండారు సత్యానందరావు- కొత్తపేట, వేగుళ్ల జోగేశ్వరరావు- మండపేట, గోరంట్ల బుచ్చయ్య చౌదరి- రాజమండ్రి రూరల్, జ్యోతుల నెహ్రూ- జగ్గంపేట ఉన్నారు.
రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీ భర్త వాసు పోటీ చేస్తారని చెబుతున్నారు. జనసేనకు పొత్తులో భాగంగా కాకినాడ రూరల్, రాజానగరం, రాజోలు సీట్లు కేటాయించినట్లు సమాచారం. పిఠాపురం స్థానం కూడా తమకు ఇవ్వాలని జనసేన కోరుతోంది. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించారు. అక్కడ జనసేన సీటు ఆశిస్తోంది.
రామచంద్రాపురం టికెట్ కోసం వాసంశెట్టి సుభాష్, డాక్టర్ కాడా వెంకటరమణ, రెడ్డి సుబ్రహ్మణ్యం, పిల్లి అనంతలక్ష్మి, కుడిపూడి వెంకటేశ్వరరావు, రెడ్డి అనంతకుమారి, మేడిశెట్టి సత్యనారాయణ పోటీలో ఉన్నారు. అమలాపురంలో మాజీ ఎమ్మెలయే ఆనందరావు వైపు మొగ్గు ఉన్నా మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు కుమార్తె సత్యశ్రీ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది.
పి.గన్నవరం సీటులో మహాసేన రాజేశ్, గంటి హరీశ్, మోకా బాలగణపతి, మోకా ఆనందసాగర్ పేర్లపై అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. రంపచోడవరం(ఎస్టీ)లో మాజీ ఎమ్మెల్యే వంతర రాజేశ్వరి, శిరీషా దేవి, సున్నం వెంకటరమణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాకినాడ అర్బన్ సీటుపైనా టీడీపీ ఇంకా క్లారిటీ రాలేదు.
ఇక్కడ వనమాడి సుస్మిత, వనమాడి వెంకటేశ్వరరావు, పెనుపోతు తాతారావు, గుణ్ణం చంద్రమౌళి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే జిల్లాలో 5 సీట్లు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ జనసేన మాత్రం 8 సీట్లు కోరుతున్నట్టు తెలుస్తోంది. దీంతో మరో మూడు సీట్ల విషయంలో చంద్రబాబు, పవన్ మధ్య చర్చల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.