Jagan Experiments : ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. రెండు, మూడు నెలల్లో జరిగే ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలను అమల్లోకి తెస్తున్నాయి. వైసీపీ తాజాగా నాలుగో లిస్ట్ కూడా ప్రకటించింది. టీడీపీ, జనసేన నేతలు మాత్రం వైసీపీ అభ్యర్థుల పూర్తి ప్రకటన తర్వాతే తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. వైసీపీకి దీటైన అభ్యర్థులను ప్రకటించే దిశగా అన్ని కోణాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జగన్ రెడ్డిని గద్దె దించేందుకు ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోవద్దనే ఆలోచనతో వారు ముందుకెళ్తున్నారు.
వైసీపీ అధినేత జగన్ కు ఈ ఎన్నికల్లో గెలవడం అత్యంత అవసరం. అందుకే ఆయన ప్రతీ నియోజకవర్గంలో నాలుగైదు సర్వేలు చేయించుకున్నారు. సగానికి పైగా సీట్లలో తమ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలింది. దీంతో భయపడిపోయిన ఆయన వ్యతిరేకత ఉన్న సిట్టింగుల మార్పులు, చేర్పుల ప్రయోగానికి సిద్ధం అయ్యారు. కొందరికీ సీటు కూడా నిరాకరిస్తున్నారు. దీంతో ఆ పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఇప్పటికే చాలా మంది తమ అసంతృప్తిని వెళ్లగక్కడమే కాదు.. ఒక్కొక్కరుగా టీడీపీ, జనసేన పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. నామినేషన్ల నాటికి ఈ సంఖ్య భారీగా ఉండబోతోందని తెలుస్తోంది.
అసలు సిట్టింగులను మార్చే పనిని జగన్ ఎందుకు చేశారన్నది పరిశీలిస్తే.. గతంలో తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ వ్యతిరేకత ఉన్న సిట్టింగులను మార్చకపోవడంతో ఓడిపోయిందని ఆయన అంచనా వేస్తున్నారు. పది చోట్ల మారిస్తే 9 మంది గెలిచారనే ఉద్దేశంతో దీన్ని ఏపీలో అమలు చేయడానికి సిద్ధమయ్యారు. వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ లను మారిస్తే సరిపోతుందని మళ్లీ గెలవొచ్చు అని ఆయన అనుకుంటున్నారు. ఎప్పుడైనా వ్యతిరేకత అన్నది ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వంపైన కూడా ఎక్కువే ఉంటుందన్నది జగన్ గుర్తించడం లేదు.
తెలంగాణలో ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రైతులు, మహిళలు, పింఛన్ దారుల్లో ప్రభుత్వానికి ఎంతో కొంత సానుకూలత ఉన్నా.. రాజకీయంగా, ప్రసార మాధ్యమాల పరంగా యాక్టివ్ గా ఉండే నిరుద్యోగులు, మేధావులు, ఉద్యోగుల్లో మాత్రం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే గెలవొద్దు అనే వ్యతిరేకతతో పాటు ప్రభుత్వాన్ని రానివ్వొద్దు అనే భావన బలపడింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రధానంగా నిరుద్యోగులు, ఉద్యోగుల వల్లే ఓడిపోయిందని గుర్తించాలి.
ఇక ఏపీలో కూడా జగన్ పాలనలో ఒక్క ఇండస్ట్రీ రాకపోవడం, మూడు రాజధానుల అయోమయం, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవడం, ఉద్యోగుల సమస్యలు..ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. వీటిని పట్టించుకోకుండా సంక్షేమ పథకాలు అమలు చేశాం.. ప్రజలే తమను గెలిపిస్తారు అన్న భావన సరైంది కాదు. ఒకవేళ మంచే చేస్తే మరి అభ్యర్థులను మార్చడం ఎందుకు? అంతా బాగానే ఉంది కదా.. సిట్టింగులతోనే ఎన్నికలకు వెళ్లాలి. మారుస్తున్నారంటే మంచి చేయలేదనే కదా అర్థం. జగన్ ప్రయోగాలపై జనాలు ఏం తేలుస్తారన్నది ఎన్నికల తర్వాతే తెలియనుంది.