Ap BJP: భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మార్పుల అనంతరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై పడింది. తెలంగాణలో పార్టీ అధ్యక్ష పగ్గాలను బండి నుంచి కిషన్ రెడ్డికి ఇచ్చిన హై కమాండ్. ఏపీలో కూడా సోము నుంచి పురందేశ్వరికి అప్పగించింది. కానీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. అదేంటంటే.. పార్టీ ఏపీ ఇన్‌చార్జిగా బండి సంజయ్ ను నియమించాలని చూస్తోంది.
బీజేపీ రాజకీయం ఒక పట్టాన అంతుచిక్కదు. ఇప్పటి వరకు జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకున్న బీజేపీ. టీడీపీతో కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదు. గతంలో పుణేలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి పవన్ ను ఆహ్వానించిన బీజేపీ, టీడీపీని పిలవలేదు.
తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయం మొదలుపెట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చింది. బండికి ప్రమోషన్ ఇచ్చిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దీంతో పాటు మరో కీలక బాధ్యత అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఇన్ చార్జి బాధ్యతలు కూడా ఆయన భూజాలపైనే వేయాలని చూస్తోంది.
కీలకమైన సమయాల్లో కేంద్రంలోని బీజేపీ వైసీపీ మద్దతు తీసుకుంటుంది. కానీ, ఏపీలో మాత్రం జనసేనతో కలిసి ప్రయాణం చేస్తోంది. టీడీపీతో వైఖరిపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. కేంద్ర మంత్రి మురళీధరన్ 2018 నుంచి ఏపీ బీజేపీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తూనే ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నడు. కానీ మూడు, నాలుగు నెలలకు ఒకసారి కూడా ఏపీకి రావడం లేదు. దీంతో ఈ బాధ్యతలు తనకు తలకు మించుతున్నాయని, తప్పించాలని పార్టీ హైకమాండ్ ను మురళీధరన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో గత ఎన్నికల తరువాత చేరిన కొందరు నేతల తీరు.. పార్టీ రాష్ట్ర శాఖలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో మురళీధరన్ తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రాల్లో ఇన్ చార్జిలు, సహ ఇన్ చార్జిలను మార్చేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మురళీధరన్ కూడా ఈ బాధ్యతల నుంచి తనను తప్పించాలని కోరుతుండగా కొత్త ఇన్ చార్జి నియమాకంపై పార్టీలో తీవ్రంగా కసరత్తు జరుగుతోంది. అందులో బండి సంజయ్ ని నియమించే అవకాశాలున్నట్లు బీజేపీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు.
బండి సంజయ్ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మంచి మైలేజ్ వచ్చింది. కేడర్ బలోపేతం కావడంతో పాటు కార్యకర్తలు పెరిగారు. దీనికి తోడు ఆయన పాదయాత్రతో పార్టీ గ్రామ స్థాయి వరకు వెళ్లగలిగింది. ఇదే తరహాలో ఏపీలో కూడా వ్యవహరిస్తే పార్టీకి మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉందని, రెండు రాష్ట్రాలకు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీతో పాటు ఇటు తెలంగాణలో కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. దీనిపై రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.