IT companies : డిసెంబర్ త్రైమాసిక గణాంకాల్లో దేశీయ ఐటీ సేవల కంపెనీలు స్తబ్ధత ప్రదర్శించొచ్చని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా, ఐరోపాల్లో దాదాపుగా అన్ని రంగాలలోని ఖాతాదారులు
ఐటీ సేవల కోసం బడ్జెట్ కేటాయింపుపై ఆచి, తూచి వ్యవహరించడం, ప్రాజెక్టులు ఆలస్యమవుతుండడంతో.. ఊహించని విధంగా బెంచ్‌పై కూర్చున్న ఐటీ నిపుణుల సంఖ్య పెరగడం, ఉద్యోగుల వేతనాల పెంపుతో పడిన భారం ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు.
జనవరి 11 నుంచి ఫలితాల వెల్లడి
టీసీఎస్, ఇన్ఫోసిస్ 2024, జనవరి 11వ తేదీ, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 12వ తేదీ, ఎల్‌అండ్‌టీ మైండ్‌ట్రీ 16వ తేదీ, టెక్ మహీంద్రా 24వ తేదీ, సైయెంట్ 25వ తేదీన మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి.
కొన్ని త్రైమాసికాలుగా..
దేశీయ ఐటీ కంపెనీల సేవలను కీలక మార్కెట్లయిన పాశ్చాత్య దేశాల్లో అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితులు, వడ్డీ రేట్ల పెంపు వల్ల బలహీన పడ్డాయి. దీని వల్ల కొన్ని త్రైమాసికాలుగా ఐటీ రంగం ఇబ్బంది పడుతోంది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ), టెక్నాలజీ సేవల రంగాల్లో సెంటిమెంట్ పటిష్టంగా లేదు. ఫలితంగా కొత్త ప్రాజెక్టులు లేక బెంచ్‌పై కూర్చుంటున్న నిపుణుల సంఖ్య పెరుగుతుంది. నూతన నియామకాలు కూడా తగ్గుతున్నాయి. క్యాంపస్ సెలక్షన్స్ లో ఆఫర్ లెటర్లు ఇచ్చినా.. వారిని ఆఫీసులకు పిలవడం ఆలస్యమవుతోంది. ఈ అంశాలన్నీ దేశీయ ఐటీ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలపై ప్రభావం చూపొచ్చు. అగ్రశ్రేణి (టైర్-1), మధ్యస్థాయి (టైర్-2) కంపెనీల ఆదాయాల వృద్ధి, మార్జిన్లపైనా ప్రభావం పడవచ్చని బ్రోకరేజీ సంస్థలు అంచనాకు వచ్చాయి. యూఎస్ లో ఉద్యోగ నియామకాలు పెరుగుతున్నా, వడ్డీ రేట్లు తగ్గకపోవడం అనిశ్చితికి కారణం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి త్రైమాసికం వారీగా 0.7 శాతం, ఏడాదిలో పరిశీలిస్తే 2.5 శాతంగా నమోదు కావచ్చన్నది సంస్థల అంచనా.
రూపాయి మద్దతు..
మూడో త్రైమాసికం (క్యూ3)లో డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడడం ఐటీకి కలిసి రావచ్చు. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డాలర్ల రూపంలో ఆదాయం చూస్తే పెద్దగా మార్పు కనిపించకపోవచ్చు. రూపాయిలో చూస్తే మెరుగ్గా ఉండవచ్చు. త్రైమాసికం వారీగా టైర్-1 ఐటీ కంపెనీల వృద్ధి -2.6 శాతం నుంచి 5 శాతం, టైర్-2 సంస్థలకు 1-3 శాతం ఉండవచ్చని భావిస్తున్నారు. టైర్-1, టైర్-2 కంపెనీల ఆదాయ వృద్ధిలో అంతరం తగ్గొచ్చు. మూడో త్రైమాసికంలో భారీ ప్రాజెక్టుల ప్రకటనలు తక్కువగానే ఉండడం గమనార్హం.
టైర్-1 కంపెనీలకే మొగ్గు
టైర్-2 కంపెనీలతో పోలిస్తే టైర్-1కే బ్రోకరేజీలు మద్దతిస్తున్నాయి. హెచ్‌సీఎల్ టెక్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మోతీలాల్ పేర్కొంది. టైర్-2లో సైయెంట్‌ను పరిశీలనలోకి తీసుకోవచ్చని చెప్తుంది. ఆర్డరు పుస్తకం బలంగా ఉన్నా.. ఐటీ కంపెనీల పని తీరు క్యూ3లో స్తబ్ధుగానే ఉండొచ్చని మరొక బ్రోకరేజీ సంస్థ ఛాయిస్ ఈక్విటీ చెప్తుంది.
స్వల్పకాలంలో..
సీజన్ పరంగా మూడో త్రైమాసికంలో ఐటీ సేవలకు గిరాకీ తక్కువగా ఉండడం.. ఆదాయ స్తబ్ధతకు దారితీయచ్చని ‘అరిహంత్ క్యాపిటల్’ చెప్తోంది. టైర్-1 కంపెనీల్లో టీసీఎస్, టైర్-2లో కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, రూట్ మొబైల్‌ను పరిశీలించ వచ్చని పేర్కొంటుంది. ఇటీవలి కాలంలో ఈ రంగ షేర్లలో ర్యాలీ కనిపించిన నేపథ్యంలో స్వల్పకాలంలో ఊగిసలాటలు కనిపించొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటోంది.