AP ఏపీలో మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలో గెలుపు వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల అధినేతలు, కీలకనేతలు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. ప్రజల్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. మ్యానిఫెస్టో తయారీ, ప్రచార కార్యక్రమాలపై ఎజెండాను సిద్ధం చేసుకుంటూ ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు.
ఇక అధికార వైసీపీ లో అధినేత మినహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల యాత్ర పేరిట జనాల్లోకి వెళ్తున్నారు. యువనేత లోకేశ్ కూడా ఇప్పటికే యువగళం పాదయాత్ర పేరిట రాష్ర్టం మొత్తం చుట్టేస్తున్నారు. ఆయన పూర్తిస్థాయిలో గత కొంత కాలంగా ప్రజల్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు.
ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ రెండు విడుతల్లో వారాహి యాత్ర చేపట్టారు. ఇక ఆయన కూడా ప్రజల్లో ఉండేందుకు సన్నద్ధమవుతున్నారు. మంగళగిరిలో నే ఆయన మకాం వేయబోతున్నారు. హైదరాబాద్ కార్యాలయం నుంచి కంప్యూటర్లు ఇతర సామగ్రి ఇప్పటికే మంగళగిరి తరలించినట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక మంగళగిరి కేంద్రంగా ఇక ఆయన యాత్రలు సాగనున్నాయి. ఇందుకు అనుగుణంగా ఆయనకు అక్కడి కార్యాలయంలో నివాసం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో అధికార వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా పవన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే రాజధాని అమరావతి ప్రాంతమైన మంగళగిరిని ఆయన కేంద్రంగా ఎంచుకున్నారు. ఇక అక్కడి నుంచే రాష్ర్ట వ్యాప్తంగా జనసేన శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు.