Tirumala New Rules : ప్రపంచ వ్యాప్తంగా Uఉన్న హిందూ దేవాలయాల్లో అతి పెద్దది, అతి ఎక్కువ భక్తులు సందర్శించుకునేది మన తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల ఉన్న హిందూ భక్తులు తరలివస్తుంటారు. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతీ కుటుంబం ఏడాదికి ఒకసారైనా స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక ఏపీలోని వారైతే ఏ శుభకార్యం మొదలు పెట్టేముందు స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ, అలాగే బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక రోజుల్లో స్వామివారిని దర్శించుకునే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. అందుకే తిరుమల ‘ఇల వైకుంఠం’ అని కూడా అంటారు.
అయితే తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. నడక దారిన వెళ్లే భక్తులపై వన్యప్రాణుల దాడులు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత కోసం ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు తెలుసుకుందాం..
-నడక మార్గంలో వెళ్లే ప్రతీ భక్తుడికి ఆత్మరక్షణ కోసం కర్రలు ఇవ్వాలని నిర్ణయించింది.
– అలాగే నడక మార్గంలో వెళ్లేందుకు సమయాన్ని కూడా నిర్ణయించింది. 12 ఏండ్లలోపు పిల్లలతో వెళ్లే వారిని ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు. అలాగే ఇతర భక్తులను ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలకు ఎవరిని కూడా నడక మార్గంలో అనుమతించరు.
– ఇక ఘాట్ రోడ్లపై ద్విచక్ర వాహనాలు ప్రయాణించడానికి కూడా టీడీడీ బోర్డు పలు ఆంక్షలు విధించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు.
-వన్యప్రాణుల నుంచి భక్తులకు రక్షణ కల్పించేందుకు గాను జంతువులను అదుపు చేయగల అటవీ సిబ్బందిని నియమించుకోవాలని నిర్ణయించింది.
-నడక మార్గంలో వెళ్లే భక్తులను విడివిడిగా కాకుండా గుంపులుగా మాత్రమే పంపించనున్నారు.
– భక్తుల బృందంతో పాటు ఒక సెక్యూరిటీని పంపేందుకు కూడా నిర్ణయించింది.
– నడక మార్గంలో జంతువులకు ఆహారం అందించడం వంటి వాటిపైన కూడా నిషేధం విధించింది. నడక మార్గంలో ఎక్కడా ఆహారాన్ని పడవేయద్దని టీడీడీ సూచించింది.
– అలాగే జంతువులకు ఆహారం అందించడానికి దుకాణాల్లో ఆహార పదార్థాలు విక్రయిస్తే దుకాణదారులపై చర్యలు తీసుకోనున్నారు.
మరి పై విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. తిరుమల వెళ్లినప్పుడు నడక మార్గంలో ఈ జాగ్రత్తలు అన్ని తీసుకుని స్వామి వారి సేవలో తరించండి.