Telangana BJP :
తెలంగాణ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గత అధ్యక్షుడు బండి సంజయ్ సేవలను కొనియాడారు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అంటూ గొప్పలు చెప్పారు. ఇక కిషన్ రెడ్డి నాయకత్వంలో మరింత దూకుడు కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమం మొత్తం బాగానే సాగింది. అయితే కార్యక్రమానికి వచ్చిన ఒక్క నేత విషయంలో తెలంగాణలో చర్చ మొదలైంది.
స్వయంగా రాష్ర్టంలో పార్టీకి కీలక నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి సదరు నేత విషయంలో చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి ఏపీ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఆయన గతంలో తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. సమైక్యాంధ్ర పేరుతో ఒక పార్టీని కూడా పెట్టారు. అయితే ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ బీఆర్ఎస్ ను ఢీకొట్టాలంటే బీజేపీకి మాత్రమే సాధ్యమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా మళ్లీ వారంతా పార్టీ మారుతారని తెలిపారు. కలిసికట్టుగా పనిచేస్తే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతులో ఉందంటూ చెప్పుకొచ్చారు.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో కొందరు బహిరంగంగానే విమర్శలకు దిగారు. నాడు తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తిని ఎలా పిలుస్తారని మండిపడుతున్నారు. అయితే ఈ విషయమై పార్టీ కీలక నాయకురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తితో వేదిక పంచుకోవడం ఇష్టం లేకే వెళ్లిపోతున్నట్లు పేర్కొన్నారు. అయితే మరోసారి బీజేపీలో అసంతృప్తుల అంశం తెరపైకి వచ్చింది.