lokesh టీడీపీపై బురదజల్లేందుకు ప్రయత్నించి మరోసారి బుక్కయ్యింది సాక్షి పేపర్. ఏపీలో సీఎం జగన్ కు చెందిన ఈ పత్రిక చంద్రబాబు, ఆ పార్టీ నేతలను తిట్టిపోయడానికే పేజీలు పేజీలు వార్తలు ప్రచురిస్తుందనే పేరు సంపాదించుకుంది. అయితే గతంలోనూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ యువనేత లోకేశ్ పై చినబాబు చిరుతిండి పేరిట వార్తలు రాసింది. అప్పుడు విశాఖ కోర్టు బోనులో నిలబడాల్సి వచ్చింది. తాజాగా మరోసారి తప్పుడు వార్తలు రాసి అడ్డంగా బుక్కయ్యింది. ఈసారి ఇక మంగళగిరి కోర్టులో నిలబడాల్సి వచ్చింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ పేరిట భారీ అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చాలా రోజుల నుంచి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ చైర్మన్ గా ఉన్న అజయ్ రెడ్డి దీనిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇదే సాక్షి ప్రధానంగా పెద్ద కథ అల్లి వడ్డి వార్చింది. అయితే తనపై చేసిన ఆరోపణలుక సాక్షాలివ్వాలని లేకపోతే క్రిమినల్ కేసు పెడుతానని లోకేశ్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు అజయ్ రెడ్డితో పాటు సాక్షి పత్రికకు కూడా అందాయి. అయితే దీనిపై ఎలాంటి సాక్ష్యం వారు చూపలేకపోయారు. దీంతో లోకేశ్ మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు పిటిషన్ వేశారు. గతంలోనూ వైసీపీ నేతలు కొందరు ఇలాగే ఆరోపణలు చేశారు. వారిపైన కూడా లోకేశ్ క్రిమినల్ కేసుల పిటిషన్ వేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన పరువుకు భంగం కలిగిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఆధారాలు చూపించాలని అడిగినా ఎలాంటి సాక్ష్యాలు చూపించకపోగా, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా తరచూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్న సాక్షి పత్రికపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తన ఇమేజ్ కు భంగం కలిగిస్తున్న సాక్షి పత్రికను కూడా ఆయన ఇక కోర్టుకు లాగారు.