Telangana BJP :
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు విషయంలో ఎట్టకేలకు తెరపడింది. రేపు.. ఎల్లుండి.. అంటూ సాగదీసిన జాతీయ నాయకత్వం ఎట్టకేలకు బండి సంజయ్ ను బయటకు పంపింది. ఆ స్థానంలో గంగాపురం కిషన్ రెడ్డిని తీసుకుంది. వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన నాయకులు బండి నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. ఈయన నాయకత్వంలో ఎన్నికలకు పొయ్యేది లేదని జాతీయ నాయకత్వం ఎదుట మొరపెట్టుకుంటున్నారు. అయితే వారిలో ఎవరికో ఒకరికి రాష్ట్ర పగ్గాలు వస్తాయని భావించిన నేతలకు చుక్కెదురైంది. బీజేపీలో పుట్టి బీజేపీలోనే పెరిగిన గంగాపురం కిషన్ రెడ్డికి రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పారు.
బీజేపీ బండి సంజయ్ ను పక్కన పెట్టడంపై చాలా వాదనలు వినిపిస్తున్నాయి. చాలా అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అసలు ఉనికి, ఊసే లేని బీజేపీని అతి తక్కువ కాలంలో అనూహ్య రీతిలో ప్రధాన ప్రతిపక్షంగా తీసుకువచ్చిన బండి సంజయ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడు కాబట్టే పక్కన పెట్టారని వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వరకు ఆయనపై పూర్తి స్థాయిలో భరోసా పెడితే ఎంతో కొంత మెరుగైన ప్రయోజనాలు కలిగేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
బండిని పక్కన పెట్టడంపై తెలంగాణలో వింత వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ కూడా బీసీల వ్యతిరేకి అంటూ కొందరు కొత్త వాదనను తెరనపైకి తెచ్చారు. పార్టీని రెండో స్థానంలో నిలబెట్టిన బండిని కాదని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడే కాబట్టి గంగాపురం కు పగ్గాలు అప్పజెప్పారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా కేసీఆర్ స్కెచ్ అన్నట్లు కూడా వాదనలు ఉన్నాయి. రెడ్డి లేదా వెలమకే అధ్యక్ష పదవి ఇవ్వాలని కేసీఆర్ కూడా వెనుక నుంచి బీజేపీపై ఒత్తిడి తెచ్చాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ బాహాటంగానే స్పందించారు. ఏది ఏమైనా బీజేపీ బీసీల వ్యతిరేకి అన్న ముద్ర మెల్ల మెల్లగా జనాల్లోకి వెళ్తుంది. దీన్ని తొలగించేందుకు నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.