BRS-Congress : తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. కాంగ్రెస్ లోకి నేతలు వలసలు పెరుగుతున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల వరకు బీఆర్ఎస్ లో నేతలు చాలా మంది జంప్ చేసేందుకు చూస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కు షాక్ తగులుతోంది. గతంలో బీఆర్ఎస్ కూడా ఇలాగే చేసింది. అప్పుడు కాంగ్రెస్ కూడా ఇలాగే బాధపడింది. చెరపకురా చెడేవు అంటారు కదా అన్నట్లు ఇప్పుడు బీఆర్ఎస్ ఆ బాధలను అనుభవిస్తోంది.
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తన సతీమణితో పాటు కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వారంలో జాయిన్ అవుతామని చెప్పడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయ్యారని తెలియడంతో కేసీఆర్ ఆయనకు మంత్రిపదవి ఇచ్చారు. కానీ ఆలయన లోపల ఆలోచన అలాగే ఉండటంతో ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిపోయారు.
బీఆర్ఎస్ కు విధేయుడిగా ఉండే హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. త్వరలోనే మరికొందరు కాంగ్రెస్ గూటికి చేరతారని సమాచారం. దీంతో నేతలను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు. వారి మనసులను మార్చే తరం కావడం లేదు. గతంలో తాము చేసినట్లుగానే ఇప్పుడు కాంగ్రెస్ వారు చేస్తున్నారు.
బీఆర్ఎస్ నేతల అహంకార ధోరణి ఇంకా తగ్గడం లేదు. ఫలితమే వారికి వలసల బెడద పట్టుకుంది. పలు జిల్లాల్లో ఇంకా కొందరు నేతలు కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఖాళీ అయి కాంగ్రెస్ నిండుగా మారే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల వరకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి జారుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.