– ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్ ` పారిశ్రామిక సమ్మెకు మద్దతు
Farmers Protest : రెండేళ్ల క్రితం మోడీ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలు అమలు చేయాలని 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఛలోఢిల్లీ మార్చ్‌పై పోలీసులు లాఠీచార్జీ చేసి, రబ్బరు బుల్లెట్స్, టియర్‌గ్యాస్ ప్రయోగించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి, రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తీవ్రంగా ఖండిస్తున్నది. రైతుల సమస్యలు పరిష్కరించలేని కేంద్ర బిజెపి ప్రభుత్వం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై సాయుధ భద్రతా బలగాలతో దాడికి పూనుకోవడం గర్హనీయం. కనీస మద్ధతుధర కల్పిస్తామని 2014 ఎన్నికల మానిఫెస్టోలో బిజెపి చేసిన వాగ్దానం 10 ఏళ్ల తరువాత కూడా అమలు చేయకుండా రైతులను మోసగించడం అన్యాయం.
ఢిల్లీ రైతు ఉద్యమ సందర్భంగా గిట్టుబాటు ధరల చట్టం చేస్తామని చెప్పి మోడీ ప్రభుత్వం మాట తప్పింది. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం రద్దు చేసింది. దేశ సంపద కార్పొరేట్లకు దోచిపెడుతున్నది. విశాఖ ఉక్కు, ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమలు, బ్యాంకులు ప్రైవేటీకరిస్తున్నారు. బిజెపి విధానాల వలన ఈ కాలంలో లక్షా యాభైవేల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిజెపి నిరంకుశ, అప్రజాస్వామిక, మతతత్వ, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బిజెపిని ప్రజాస్వామిక వాదులు, మేధావులు నిరసించాలని, ఫిబ్రవరి 16 ఆందోళనలకు మద్దతు తెలియజేయాలని సిపిఐ(యం) కోరుతున్నది.
విద్యుత్ భారాలు లేవనడం భారీ ఊరట కాదు` భారీ మోసం
2024- 25 సంవత్సరంలో రైల్వే తప్ప అదనపు భారాలు లేవని విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి చేసిన ప్రకటన వాస్తవ విరుద్ధమైనది. గత నాలుగు సంవత్సరాల నుండి ప్రభుత్వం దొడ్డిదారిన వేలాది కోట్ల రూపాయలు విద్యుత్ బారాలు మోపింది. ప్రత్యక్షంగా చార్జీల పెంపుతో పాటు సర్దుబాటు, ట్రూ అప్ చార్జీలు, డెవలప్మెంట్ చార్జీలు, స్లాబుల మార్పిడి, అదనపు కస్టమర్ డిపాజిట్లు, విద్యుత్ సుంకం తదితర అనేక పేర్లతో ప్రజల నెత్తిన భారాలు వేశారు. ఇప్పటికీ ఆ భారాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్మార్ట్‌మీటర్ల పేరుతో అదనపు భారం మోపుతున్నది.
2024 -25 సంవత్సరాలకు మూడు రకాల సర్దుబాటు చార్జీల వసూళ్లు కొనసాగించడానికి రంగం సిద్ధం అయ్యింది. మరోవైపు ప్రతినెల యూనిట్‌కు 40పైసలు చొప్పున సర్దుబాటు చార్జీల వసూళ్లు కొనసాగుతోంది. అదనంగా మరొక 7200 కోట్ల రూపాయలు సర్దుబాటు చార్జీల భారం వేయటానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల పేరుతో ఒక్కొక్క మీటర్‌కు 13వేల రూపాయలకు పైగా గృహ, ఇతర వినియోగదారుల నుండి వసూలు చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. నివాసేతర వినియోగదారుల దగ్గర నుండి విద్యుత్ సుంకం యూనిట్‌కు 6 పైసల నుండి 100 పైసలు వరకు పెంచారు. దీన్ని న్యాయస్థానాలు కొట్టి వేయటంతో చట్ట సవరణ చేసి ఈ భారానికి చట్టబద్ధత కల్పించారు.
కనీసం ఇప్పటినుండి అయినా ఈ సర్దుబాటు చార్జీలు, ఇతర భారాలను నిలిపి వేయటానికి నియంత్రణ మండలి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు ఈ వాస్తవాలను కప్పిపుచ్చి భారాలు లేవని నియంత్రణ మండలి చైర్మన్ ప్రకటించడం తీవ్ర అభ్యంతరకరం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సర్దుబాటు, ఇతర భారాలను రద్దు చేయాలి. స్మార్ట్‌మీటర్లు బిగించడం ఆపాలని డిమాండ్ చేస్తున్నామని సీపీఐ ఒక ప్రకటనలో తెలిపింది.