DK Aruna : బీజేపీలో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్న సీనియర్ నాయకురాలు డీకే అరుణకు అధిష్టానం షాక్ ఇచ్చింది. ఈ సీటు తనకే వస్తుందని ఆశ పెట్టుకున్న ఆమెకు పార్టీ మొండిచేయి చూపింది. పార్టీ ప్రకటించిన సెకండ్ లిస్టులో మహబూబ్ నగర్ స్థానాన్ని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి కి కేటాయించింది. కేవలం ఈ ఒక్క పేరును సెకండ్ లిస్టులో ప్రకటించడం ఇక ఆమెను పొమ్మనలేక పొగ పెట్టినట్లయ్యిందనే అభిప్రాయం వినిపిస్తున్నది.
అయితే ఈ విషయమై ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ వినిపిస్తున్నది. దీంతో ఆమెకు కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం అందుతన్నది. ఆమెను కించపర్చేలా బీజేపీ ఒక్క పేరుతో ప్రకటన విడుదల చేయడం అగ్గికి మరింత ఆజ్యం పోసింది. ఇక ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. బీజేపీ నుంచి మళ్లీ సొంతగూటికి చేరుతారనే టాక్ వినిపిస్తున్నది. ఇదే నిజమైతే కాంగ్రెస్ కు మహబూబ్ నగర్ జిల్లాలో మరింత బలం పెరగనుంది.
ఇప్పటికే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు పెరుగుతున్నాయి. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కూడా పార్టీకి బైబై చెప్పారు. అయితే బీజేపీ కాంగ్రెస్ నుంచి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తున్నది. కానీ తమ పార్టీ నుంచే ఎక్కువ సంఖ్యలో చేరికలు కాంగ్రెస్ లోకి ఉంటున్నాయని పసిగట్టలేకపోతున్నది. మరి ఇప్పుడు డీకే అరుణ నిర్ణయం ఎలా ఉంటుందో మరో రెండు రోజుల్లో తేలనున్నది.