
VRAs : విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్ఏ)లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సెక్రటేరియల్ లో మంత్రి వర్గం భేటీ (మే 18)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలోనే జీవో 111 కూడా తొలగించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వీఆర్ఏలు తమను రెగ్యులరైజ్ చేయాలని దాదాపుగా ఆరేళ్ల నుంచి ఉద్యమం చేస్తున్నారు. పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.
వీరి ఉద్యమం, కలలు ఫలించాయి. వారి ఆకాంక్షలను తీరుస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 24 ఫిబ్రవరి, 2017న వీఆర్ఏలతో సమావేశమైన సీఎం కేసీఆర్ వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని, పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 2020 సెప్టెంబర్‌లో వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మరోసారి వీఆర్ఏల గురించి మాట్లాడారు. పేస్కేల్, పర్మినెంట్ తదితరాలపై ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ దిశలో ఎలాంటి పురోగతి లేకపోవడతో వీఆర్ఏలు సమ్మెకు దిగారు. 2022లో జూలై 25 నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకూ సమ్మె చేశారు.
వీఆర్ఏల నిరసనలో భాగంగా సెప్టెంబర్ 13వ తేదీ అసెంబ్లీని ముట్టడించారు. అప్పట్లో మంత్రి కేటీఆర్ వీరితో చర్చలు జరిపారు. ఆ తర్వాత అదే నెల 20వ తేదీన మరోసారి వీఆర్ఏలతో మంత్రి మాట్లాడారు. సమ్మె విరమించాలని ఆయన సూచించినా వారు వినలేదు. పర్మినెంట్, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి మంత్రులు, హరీశ్ రావు, కేటీఆర్ వీఆర్ఏ జేఏసీ నాయకులతో మాట్లాడారు. అన్నింటిపై త్వరలో చర్యలు తీసుకుంటామని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తిరిగి విధుల్లో చేరాలని వారు హామీ ఇవ్వడంతో వారు తిరిగి విధుల్లో చేరారు. వీరి కష్టం ఫలించడంతో కేబినెట్ సమావేశంలో వీరికి తీపి కబురు అందించారు సీఎం.