Shiva Balakrishna : హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మాజీ డైరెక్టర్, రెరా సెక్రటరీ శివ బాలకృష్ణ అవినీతి కేసు కీలక మలుపు తిరిగింది. అక్రమాస్తుల కేసులో ఆయనను అరెస్ట్ చేసిన యాంటీ కరెప్షన్ బ్యూరో (ఏసీబీ) ఎనిమిది రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించింది. కేసు ప్రాథమిక దర్యాప్తుపై ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
కస్టడీలో బాలకృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ ప్రకారం.. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పాత్రపైనా అనుమానాలు ఉన్నాయని ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొంది. మాజీ హెచ్ఎండీఏ డైరెక్టర్ అక్రమ ఆస్తుల కేసు విచారణలో ఐఏఎస్ అరవింద్ పేరు తెరపైకి రావడంతో అతడిని కూడా విచారిస్తామని ఏసీబీ ప్రభుత్వ అనుమతి కోరింది. బాలకృష్ణ ఎనిమిదేళ్లలో 10 సెల్ ఫోన్లు, 9 ల్యాప్ టాప్‌లు మార్చినట్లు ఏసీబీ గుర్తించింది.
భారీ లావాదేవీలు జరిపిన ప్రతీ సారి బాలకృష్ణ ఫోన్లు మార్చినట్లు ఏసీబీ తమ రిపోర్టులో పేర్కొంది. ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లో అక్రమ లావాదేవీలు గుర్తించిన ఏసీబీ.. అతడితో పాటు ఆయన కుటుంబ సభ్యుల నుంచి 31 సెల్ ఫోన్లు సైతం స్వాధీనం చేసుకున్నట్లు వెళ్లడించింది. రెరా సెక్రటరీ అక్రమ ఆస్తుల కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. అరవింద్ కుమార్ విచారణకు ఏసీబీ పర్మిషన్ కోరిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందోనని వేచి చూడాలి.
అరవింద్ పేరు బయటకు రావడంతో తర్వాత ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోనని కొందరు అవినీతి అధికారులు ఆందోళన చెందుతున్నట్లు వినికిడి. అరవింద్ పై విచారణకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.