Pawan ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. పొత్తులపై ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య ఒక అవగాహన వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే మరోవైపు జనసేన బీజేపీతో కూడా మిత్రబంధాన్ని కొనసాగిస్తున్నది. ఈ సమయంలో ఎన్డీఏ మీటింగ్ లో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ సోమవారం ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ఈ భేటీ ముగిసింది. అయితే పవన్ అక్కడే ఉండిపోయారు .
ఏపీలో పొత్తుల అంశంపై బీజేపీ అగ్ర నేతలతో మాట్లాడేందుకే పవన్ ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం అందుతున్నది.వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో కొంత గ్యాప్ ఉన్నట్లు గుర్తించారు. ఇదే అంశంపై చర్చించేందుకు పవన్ ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే బీజేపీ అగ్ర నేతల అపాయింట్మెంట్ కూడా పవన్ కోరినట్లు సమాచారం.
ఎవరెవరని కలుస్తారనేది మాత్రం రహస్యంగానే ఉంచారు. వచ్చే ఎన్నికల్లో టీడీనీని భాగస్వామ్యంలోకి తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను పవన్ బీజేపీ పెద్దలకు వివరించనున్నట్లు తెలిసింది. అధికార వైసీపీకి వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పడాలని పవన్ భావిస్తున్నారు. అది కుదరకపోతే క్షేత్రస్థాయిలో ఓట్లు చీలే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన రిపోర్టులతో పవన్ బీజేపీ పెద్దలను కలుస్తున్నారని తెలిసింది. అయితే పొత్తు విషయంలో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ పెద్దలను కలిశారు. కానీ ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆ తర్వాత ఆయన కూడా అంత దూకుడుగా కనిపించలేదు.
అయితే ఈ సమయంలోటీడీపీని కలుపుకొని వెళ్దామని పవన్ బీజేపీ నేతలకు చెప్పనున్నట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం తెలంగాణలో తమతో పొత్తు పెట్టుకోవాలని షరతు పెడుతున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ దూకుడుగా ఉంది. దీన్ని తట్టుకోవాలంటే తెలంగాణలో టీడీపీ, జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. తెలంగాణలో పొత్తుల విషయం తేలిన తర్వాతే ఏపీ గురించి మాట్లాడుకుందామని బీజేపీ పెద్దలు చెప్పినట్లు సమాచారం. మరి పొత్తు అంశంపై పవన్ ఏం తెలుస్తారో..టీడీపీతో బంధాన్ని బీజేపీ ఇష్టపడుతుందో లేదో వేచి చూడాలి. పవన్ మాత్రం టీడీపీతో కలిసి వెళ్లేందుకే సిద్ధమవుతున్నట్లుగా ఆయన అడుగులను బట్టి తెలుస్తున్నది.