ట్విట్టర్ ని కొనుగోలు చేసి సంచలనం సృష్టించిన ఎలాన్ మస్క్ కు అతడి ప్రత్యర్థి వర్గమైన జనరల్ మోటార్స్ గట్టి షాక్ ఇచ్చింది. ట్విట్టర్ ని అధికారికంగా హస్తగతం చేసుకున్న రోజునే జనరల్ మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్విట్టర్ లో జనరల్ మోటార్స్ కు సంబంధించిన యాడ్స్ ఇవ్వబోమని, అందుకు ఎలాన్ మస్క్ మా ప్రధాన ప్రత్యర్థి కావడమే కారణమని స్పష్టం చేసింది. అయితే ట్విట్టర్ తీరు తెన్నులను కొన్నాళ్ళు గమనించాక మా నిర్ణయంలో మార్పు ఉండొచ్చు కానీ దాన్ని ఇప్పుడే స్పష్టం చేయలేమన్నారు.
ఎలక్ట్రిక్ కార్ల పోటీలో ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా సంస్థ ముందుండగా దానికి ప్రధాన పోటీదారు జనరల్ మోటార్స్ కావడం గమనార్హం. దాంతో ఇకపై ట్విట్టర్ లో తమ యాడ్స్ ప్రసారం కావని స్పష్టం చేసింది. అలాగే ఫోర్డ్ కూడా ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలోకి అడుగుపెట్టడంతో ఫోర్డ్ కూడా ట్విట్టర్ కు యాడ్స్ నిలుపుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది. దాంతో ఎలాన్ మస్క్ కు ప్రారంభంలో గట్టి షాక్ లు తగులుతున్నాయని భావిస్తున్నారు.