AP ఏపీలో రాజకీయ పార్టీల నాయకుల్లానే రెండు ప్రధాన పత్రికల మధ్య కథనాల యుద్ధం నడుస్తున్నది. టీడీపీ, వైసీపీల మధ్య ఏపీలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కామన్. వీటికి అనుకూలంగా ఆ రెండు ప్రధాన పత్రికలు కూడా దుమ్మెత్తి పోసుకుంటాయి. ఇదిగో పులి అంటూ ఓ పత్రిక మొదలు పెడితే.. అదిగో తోక అంటూ మరో పత్రిక శుభం పలుకుతుంది. ఏపీలో ఈనాడు, సాక్షి మధ్య అటాక్ మోడ్ కథనాలు వస్తున్నాయి. ఇందులో మూడో పత్రిక ఆంధ్రజ్యోతి ఉంది. అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి లను ఎల్లో మీడియా గా కొందరు భావిస్తే, సాక్షిని నీలి మీడియా అంటూ మరో వర్గం సంబోంధిస్తుంటుంది. అయితే ఈ పత్రికల మధ్య వార్ కొత్తదేమి కాదు. అసలు ఆ రెండు పత్రికల అధిపత్యాన్ని తట్టుకోలేకే ఆ మూడో పత్రిక(సాక్షి) పుట్టుకొచ్చింది. కానీ ఆ రెండు ప్రధాన పత్రికలకు కౌంటర్ల ఇయ్యడానికే దానికి సమయం సరిపోతున్నది.
అయితే తాజాగా పోలవరం అవినీతిపై ఇటీవల ఈనాడు ఓ కథనం రాసింది. వైసీపీ ప్రభుత్వం ఇందులో దోచుకుందని అసలు సారాంశం. ఇంకేం వైసీపీ అనుకూల సాక్షి పేపర్ కు కోపమొచ్చేసింది. ఇక ఊరుకుంటుందా మరి.. పోలవరం అవినీతిలో ఇన్నాళ్లు చంద్రబాబును మాత్రమే దోషిని చేయాలని చూసిన ఈ పత్రిక, ఇక ఈనాడు చైర్మన్ రామెజీరావును ఇందులో జత చేసింది. చంద్రబాబుతో కలిసి డీపీటీ దందా చేశారని , మట్టి తవ్వకాల పనుల్లో ఏకంగా రూ. 150. 93 కోట్లను తన వియ్యంకుడి సంస్థతో కలిసి రామోజీరావు, చంద్రబాబు పంచుకున్నారని కథనం వెలువరించింది.
ఈ దోపిడి ని 2018లోనే సాక్షి బట్టబయలు చేసిందని చెబుతూ తాజాగా మరో సారి బ్యానర్ స్థాయి కథనాన్ని గుర్తు చేసింది. పనులు కాకుండా నే పైసలిచ్చేశారు అనే శీర్షికన ఈనాడు కథనానికి ప్రభుత్వం జవాబిచ్చినట్లుగానే పాపం సాక్షి జవాబులు రాసేసింది. చేపట్టిన పనులు.. వాటి ఉపయోగాలను వివరిస్తూ అందమైన అల్లికను తనదైన శైలిలో అద్దింది. పనులు పూర్తి చేయకుండానే రూ. 111 కోట్లను నాటి ప్రభుత్వం చెల్లించిందని చెప్పుకొచ్చారు. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో రామోజీరావును సైంధవుడిలా సంబోధిస్తూ , వాస్తవాలను వక్రీకరిస్తున్నాడని ఇందులో పేర్కొంది. ఎస్జీటీలో కేసులు వేయిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణలు చేసింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకంతో చంద్రబాబుకు ఆదరణ పెరుగుతుందనే భయంతోనే రామోజీ కుట్రలకు తెరదీశారంటూ, ఈనాడులో వచ్చిన కథనానికి కౌంటర్లు ఇస్తూ స్టోరీ రాసేసింది. దీన్ని చదివిన వారంతా ఇలా పోస్టర్లు, పాంప్లెంట్లు, లెటర్లు రాసుకున్నట్లే ప్రస్తుతం పత్రికలు ఉన్నాయని నవ్వుకుంటున్నారు. తాము చేసిన అభివృద్ధి మీద చర్చ పెట్టడం పక్కన పెట్టి, ఇలా పత్రికలు కూడా రాజకీయ నాయకుల్లా మారిపోయాయని ఎద్దేవా చేస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి, ఈనాడు,ఈటీవీ, మార్గదర్శ సంస్థల చైర్మన్ రామోజీరావుకు మధ్య పెద్ద యుద్ధమే సాగుతున్నది. తన దారికి రాని వారిని ఇబ్బంది పెట్టేందుకు జగన్ సర్కారు ప్రయత్నిస్తూనే ఉంది. దీనిపై ఎన్ని అపవాదులు వచ్చినా వెనక్కి తగ్గడం లేదు. జగన్ వ్యక్తితం పై గతంలో టీడీపీ చేసిన ఆరోపణలను నిజం చేస్తున్నట్లుగానే ప్రస్తుతం ఈ దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ నేతలే టార్గెట్ ఆయన ఈ నాలుగేళ్లుగా చేసిన దాడులు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం విషయంలోనే ఆయన కలుగజేసుకున్నారు.
ఆయన సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ, ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజావేదికను కూల్చేశారు. ఇక టీడీపీ, జనసేన నేతల మీదికి సీఐడీని ఉసిగొల్పుతూ వికట్టహాసం చేస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని ఆయనకు తెలియనిది కాదు. మరి రానున్న రోజుల్లో అయినా ఏపీలో మంచి రాజకీయాలు వస్తాయా అంటే.. ఆ దిశగా ఏ మాత్రం కనిపించడం లేదు. జగన్ వచ్చాక ఇంకా ఆ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని, బూతుల నేతలు విపరీతంగా పుట్టుకొచ్చారనే అపవాదు దక్కింది. గత రాజకీయాల్లో ఈ స్థాయిలో పరిణామాలను ఎప్పుడూ చూడలేదని, కొంత హుందా రాజకీయాలు ఉండేవని అంతా అనుకుంటున్నారు.