AP: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ చీఫ్ విప్ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు స్పీకర్ తమకు సమ యం ఇవ్వకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి ఆక్షేపించారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. కౌంటర్ వేయా లని లెజిస్లేటివ్ అసెంబ్లీ, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి, అసెంబ్లీ చీఫ్‌విప్ ప్రసాదరాజులకు నోటీసులు జారీ చేసింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వలేమంది. విచారణను ఫిబ్రవరి 24కి వాయిదా వేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణమోహన్ సోమవారం ఆదేశాలిచ్చారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పిటిషన్‌తో చీఫ్ విప్ జత చేసిన పత్రికా కథనాలను, యూట్యూబ్ లింక్‌ల వివరాలు అందజే యాలని, కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని పిటిషనర్లు స్పీకర్‌ను కోర గా నిరాకరించారని తెలిపారు.