Print Media : ప్రింట్ మీడియాకు ఆదరణ తగ్గడం.. రోజు రోజుకు ప్రింటింగ్ వ్యయం పెరగడంతో ప్రధాన పత్రికలన్నీ డిజిటల్ వైపు పరుగులు తీస్తున్నాయి. ఇందులో తెలుగు నాట అత్యంత ఆదరణ పొందిన పత్రిక ఈనాడు కూడా లేకపోలేదు. ఈనాడు వేజ్ బోర్డ్ ను అమలు చేస్తుందని అందరికీ తెలిసిందే. అయితే ఈ బోర్డు కిందికి అందరు ఉద్యోగులు రారు. ఇందులోనూ శ్రమ దోపిడీ ఉండనే ఉంటుంది. కేవలం ఉషోదయ పబ్లికేషన్ పరిధిలో పని చేసే ఉద్యోగులకు మాత్రమే వేజ్ బోర్డ్ వర్తిస్తుంది. ఈనాడు డిజిటల్, న్యూస్ టుడే, ఈటీవీ భారత్ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు ఇటువంటివి వర్తించవు.
ఈనాడు సంస్థలకు సంబంధించి ప్రధాన ఆదాయ వనరు ఆ పత్రికనే. కొంత కాలంగా ప్రింట్ మీడియా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఈనాడు యాజమాన్యం అన్నదాత, విపుల, సితార లాంటి సంచికలకు మంగళం పాడింది. త్వరలో మరో కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈనాడు నెట్ లో ఆన్ లైన్ వార్తలకు సంబంధించి ఆ పత్రిక యాజమాన్యం ఒపీనియన్ సర్వే నిర్వహిస్తోంది. అందులో ఈ ప్రశ్నలకు సమాధానం కావాలని కోరింది.
* ఎలాంటి వార్తలు ఇష్టపడతారు?
* సంక్షిప్తమైన వార్తలను ఇష్టపడతారా..? లేక సుదీర్ఘంగా ఉండాలా..?
* మీరు సమాచారం కోసం వేటిని సంప్రదిస్తారు..? వార్తాపత్రికలనా, న్యూస్ చానళ్లనా?
* తప్పుడు వార్తలను ఏ విధంగా గుర్తిస్తారు?
ఈ ప్రశ్నలను ఒపీనియన్ సర్వే కోసం ఈనాడు.నెట్ లో పెట్టింది. అంటే దీని ప్రకారం ఈనాడు త్వరలో ప్రింట్ మీడియాకు స్వస్తి పలికి డిజిటల్ మీడియాలోకి రావాలని చూస్తోందని ఇట్టే అర్థం అవుతుంది. ప్రింట్ మీడియా వ్యయం పెరగడంతో యాజమాన్యం ఈ దిశగా కదులుతుందని సమాచారం. ప్రస్తుతం ఈనాడు జర్నలిజం స్కూల్ స్టూడెంట్లకు ప్రింట్ మీడియాపై కాకుండా డిజిటల్ మీడియాపై శిక్షణ ఇస్తున్నట్లు జర్నలిజం స్టూడెంట్లు చెప్తున్నారు. దీన్ని బట్టి ప్రింట్ మీడియా క్లోజ్ చేయాలని భావిస్తున్నట్లు అర్థం అవుతుంది.
వ్యయాన్ని భారీగా తగ్గించుకోవడం కోసం భారీ వేతనాలు ఉన్న ఉద్యోగులను ‘గోల్డెన్ షేక్ హ్యాండ్’ పేరుతో బయటికి పంపిస్తోంది. ఒకవేళ ఎవరైనా బయటకు వెళ్లాలనుకుంటే వేగంగా సెటిల్ చేసి పంపిస్తుంది. గతంలో ఈనాడులో ఇటువంటి సంప్రదాయం ఉండేది కాదు. ఉద్యోగి బయటకు వెళ్లాలనే నేపంతో సక్రమంగా విధులు నిర్వహించకుంటే.. అతన్ని ఏదో ఒక విభాగానికి పంపించే వారు తప్ప బయటకు మాత్రం పంపించేవారు కాదు. గత సంప్రదాయానికి ఇప్పుడు యాజమాన్యం భిన్నంగా వ్యవహరిస్తుంది.
ఇక ఈటీవీ భారత్, ఈనాడు.నెట్ ను బలోపేతం చేసిన యాజమాన్యం.. వాటిని మరింత పరిపుష్టం చేయాలని భావిస్తోంది. కొవిడ్ తర్వాత ఈనాడు ప్రింట్ బాధ్యతను కళాజ్యోతి సంస్థకు అప్పగించాలని అప్పట్లో అనుకున్నారు. కానీ ఆ ఆలోచనను యాజమాన్యం విరమించుకుంది. గతంలో ఈనాడు కవర్ ప్రైస్, యాడ్ టారిఫ్ అస్సలు తగ్గించకపోయేవారు. కొంత కాలం నుంచి టారిఫ్ చాలా వరకు తగ్గింది. ప్రకటనల కోంస ఆఫర్లు కూడా ఇస్తోంది. దీన్ని బట్టి ఇటు పార్లమెంట్, అటు ఏపీ ఎన్నికలు ముగిసే వరకు ప్రింట్ ఉంచుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత పూర్తిగా డిజిటల్ లోకి మారుతుందని మాజీ జర్నలిస్టులు బాహాటంగానే చెప్తున్నారు. అందుకు యాజమాన్యం ఇస్తున్న ఈ సంకేతాలే కారణం అంటున్నారు. దక్షిణాదిలో తెలుగునాట ప్రముఖ పత్రికగా గుర్తింపు సంపాదించుకున్న ఈనాడు పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారిపోవడం సంచలనమే.