నటశేఖర కృష్ణ ను సూపర్ స్టార్ ను చేసిన చిత్రం ” ఈనాడు ”. 1982 డిసెంబర్ 17 న విడుదలైన ఈనాడు చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కృష్ణ నటించిన 200 వ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే తెలుగునాట అఖండమైన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో హీరో కృష్ణ కు హీరోయిన్ ఉండదు అలాగే డ్యూయెట్ లు లేవు దాంతో ఈ సినిమా ఆడటం కష్టమే అని అన్నారట కొంతమంది.
అయితే సినిమా విడుదల అయ్యాక మాత్రం రికార్డుల మోత మోగించింది. అప్పట్లోనే 2 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ విశ్లేషకులను షాక్ అయ్యేలా చేసింది. ఈనాడు విడుదల అయిన సమయంలోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చాడు. ఇంకేముంది ఈనాడు ప్రభావం తెలుగుదేశం పార్టీ మీద కూడా పడింది. దాంతో ఈనాడు సినిమా తెలుగుదేశం పార్టీకి కొంతవరకు ఉపయోగపడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కృష్ణ , రావు గోపాలరావు , రాధిక , జమున , కైకాల సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , చంద్రమోహన్ , కాంతారావు , జగ్గయ్య , గిరిబాబు , గుమ్మడి వెంకటేశ్వర్ రావు , కృష్ణకుమారి , సుధాకర్ తదితరులు నటించగా పద్మాలయా స్టూడియోస్ పతాకంపై సాంబశివరావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు కృష్ణ సోదరులు ఆదిశేష గిరిరావు – హనుమంతరావు. ఇక ఈ చిత్రాన్ని కేవలం 35 లక్షల బడ్జెట్ తో నిర్మించగా 2 కోట్లకు పైగా వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఇక పరుచూరి బ్రదర్స్ డైనమైట్ ల లాంటి డైలాగ్స్ కృష్ణ నోటి వెంట రావడంతో థియేటర్ లు దద్దరిల్లిపోయాయి.
ఈనాడు చిత్రం విడుదలై సరిగ్గా 40 సంవత్సరాలు. 1982 డిసెంబర్ 17 న విడుదల కాగా 2022 డిసెంబర్ 17 కు 40 ఏళ్ళు పూర్తి అయ్యాయి. దాంతో ఈనాడు సాధించిన విజయాలను , సృష్టించిన రికార్డులను తల్చుకుంటున్నారు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు.