“BRO” Movie :
బ్రో సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో వచ్చిన వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా తీశారు. నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశారు. కథలో మాటలు త్రివిక్రమ్ అందించారు. తనదైన శైలిలో డైలాగులు విసరడంతో ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మాతలుగా వ్యవహరించారు. థమన్ సంగీతం ప్లస్ అయింది. దీంతో సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
సినిమా పేరు మొదటగా చిరంజీవి, కాలపురుషుడు అనే టైటిల్ పెట్టాలని అనుకున్నా చివరకు బ్రోగా మార్చారు. కేతికా శర్మ, ప్రియ ప్రకాష్ వారియర్ నటించారు. ఐటమ్ సాంగులో ఊర్వశి రౌటెలా కనిపించింది. మొత్తానికి సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతుంటే రెండు చోట్ల మధ్య మాత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లోని కావలి లోని లత థియేటర్ లో సౌండ్ సిస్టమ్ ఫెయిల్ కావడంతో సినిమా నిలిపివేశారు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులకు థియేటర్ యాజమాన్యానికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ఇంకా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని శ్రీదేవి థియేటర్ లో కూడా షో నిలిపివేశారు.
సాంకేతిక కారణాలతో సినిమా వేయకపోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. ఇక్కడ కూడా పోలీసులు వచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు. గూడూరు పట్టణంలోని సంగం థియేటర్ లో ఫ్లెక్సీల దుమారం కూడా అభిమానులకు యాజమాన్యానికి మధ్య గొడవకు దారి తీసింది. ఇలా పవన్ కల్యాణ్ సినిమా అక్కడక్కడ గొడవలకు కారణం అయ్యాయి.