Silence of Purandeshwari : మాజీ సీఎం ఎన్టీఆర్ కుమార్తె రాజకీయంగా అంతగా కలిసి రావడం లేదనిపిస్తున్నది. టీడీపీలో చంద్రబాబు కుయుక్తులను తట్టుకోలేక పార్టీని వీడారు. ఆ తర్వాత కాంగ్రెస్లో సాగినా రాజకీయంగా వచ్చిన మైలేజీ కూడా చివరికి బీజేపీలో చేరి ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా ఆ పార్టీకి, ఆమెకు ఎటూ కలిసి రావడం లేదు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలుపెడతారని అంతా భావించారు. అందుకు ఆమె కూడా ఆ అంచనాలకు తగ్గట్లుగానే జగన్ ప్రభుత్వం మీద ఘాటుగా విమర్శలు, ఆరోపణలు చేశారు. కానీ రావాల్సిన మైలేజీ మాత్రం ఆమడ దూరంలో ఉంది.
అటు నందమూరి కుటుంబ నేపధ్యం, ఇటు అత్యంత శక్తివంతమైన కేంద్రం ఆమె వెనుక ఉన్నా ఆమెను ముందే కట్టడి చేయకపోతే తట్టుకోవడం కష్టమని గ్రహించిన వైసీపీ నేతలు ఆమె చంద్రబాబు నాయుడు తరపునే టీడీపీ కోసమే ఏపీలో రాజకీయాలు చేస్తున్నారంటూ ఎదురుదాడి చేసి ఆమె కాళ్ళు, చేతులు, నోరు కట్టేశారు. అందుకే చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఆమె చాలా క్లుప్తంగా స్పందించాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఆమె గట్టిగా ఖండించలేకపోతున్నారు. ముందర కాళ్లకు బంధం వేయడం అంటే ఇదే కావచ్చు.
వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి ఆమెను మాట్లాడనీయకుండా చేస్తే, చంద్రబాబు నాయుడు అరెస్టుపై మోడీ, అమిత్ షాలు స్పందించకుండా మౌనం వహిస్తూ వారు కూడా ఆమెను మాట్లాడనీయకుండా చేశారు. చివరికి జనసేన-బీజేపీ పొత్తుల గురించి కూడా మాట్లాడలేని పరిస్థితి కల్పించారు.దీంతో ఏపీ రాజకీయాలలో సునామీ సృష్టించాలని ఉత్సాహంగా వచ్చిన దగ్గుబాటి పురందేశ్వరి ఉసూరమనక తప్పడం లేదు. ఇప్పుడు ఆమె ఏపీ రాజకీయాలలో దేని గురించి కూడా మాట్లాడలేని దుస్థితి.