YS Sharmila : వైఎస్సార్టీపీ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, ఓ వేదిక, తేదీ ఖరారవడమే ఉందని ప్రచారం జరుగుతున్నది. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో ఓవర్గం షర్మిల ఎంట్రీని అడ్డుకుంటున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నది. ఆమెను ఏపీకి మాత్రమే పరిమితం చేయాలని సదరు వర్గం డిమాండ్ నేపథ్యంలో చర్చలు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకురావాలని ఓ పెద్ద నేత ముందునుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. సదరు నేతకు అధిష్టానానికి పూర్తిస్థాయి సఖ్యత ఉండడంతో, ఇక షర్మిల గ్రాండ్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తున్నది.
డీకే శివకుమార్. ఇప్పుడు ఈ పేరు తెలియని వ్యక్తి ఉండరు. ఆయన రాజకీయాల్లో ఓ సంచలనంగా మారారు. ఇప్పుడు ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా తయారయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను ఒంటి చేత్తో గెలిపించిన బాహుబలి. అధికార ఎన్డీఏ కు కొరకరాని కొయ్య తయారైన ధీశాలి. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే గురించి ఎంత చెప్పిన తక్కువే. అయితే డీకేకు వైఎస్ కుటుంబానికి ఎన్నో ఏండ్లు సఖ్యత ఉంది. అయితే ముందుగా షర్మిల ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించింది కూడా ఆయనే. ఆ తర్వాత షర్మిల కూడా ఆయన ను పలుమార్లు కలిసి మాట్లాడింది. రానున్న తెలంగాణ ఎన్నికల్లో డీకే సేవలను వాడుకోవాలని అధిష్టానం భావిస్తున్నది. డీకే స్ర్టాటజీ బాగుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కూడా తెలుసు.
తెలంగాణలో గెలవాలంటే పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు అవసరమవుతాయి. డీకే వాటిని సమకూర్చగలడు. దీంతో డీకే నిర్ణయాలకు ఇక్కడ తిరుగుండదు. షర్మిలను పార్టీలోకి తీసుకొని ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన నిర్ణయిస్తే తెలంగాణలో సమీకరణాలు మారే చాన్స్ కనిపిస్తున్నది. ఇప్పటికే రేవంత్ రెడ్డి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కొందరు సీనియర్లు తహతహలాడుతున్నారు. ఇప్పుడు వారికి షర్మిల రూపంలో ఓ చాన్స్ దొరకబోతున్నది. ఏదేమైనా తెలంగాణలో పాగా వేయాలని కాంగ్రెస్ ఆలోచనలకు ఈ చిన్న చిన్న అంశాలే ప్రమాదంగా మారే సీన్ కనిపిస్తున్నది. రేవంత్ వర్గం మాత్రం షర్మిల తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడం ఇష్టపడడం లేదు. మరి రానున్న రోజుల్లో అధిష్టానం ఎలాంటి బాధ్యతలు షర్మిల కు అప్పగించబోతుందో వేచి చూడాలి.