- అక్టోబర్ లో నోటిఫికేషన్ జారీకి కసరత్తు

EC in Telangana : తెలంగాణలో అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 16తో యుగియనున్నది. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. వారం క్రితం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ర్టంలో పర్యటించడంతో పొలిటికల్ వార్ మరింత జోరందుకుంది. అధికార బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నాయి అయితే ఎన్నికల గడువు దగ్గరపడుతున్న రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని.. నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఈ ఏడాది అక్టోబర్ 10న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. వారం క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు రాష్ట్రంలో పర్యటించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలకఅంశాలపై సీఎస్, డీజీపీ, కలెక్టర్లతో సమావేశమై చర్చించారు. పలు సూచనలు, సలహాలు చేశారు.
మరో మూడు నెలల్లో నోటిఫికేషన్ ..
తెలంగాణలో ఏడాదిలోపే ఎన్నికలు ఉంటాయని రాజకీయ పార్టీలు ఇప్పటికే తమదైన శైలిలో ముందుకు సాగుతున్నాయి. దీనికి తగ్గట్లుగానే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రణాళికను రూపొందించేందుకు సమాయత్తమవుతున్నది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో ముగుస్తుండగా, ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. రాష్ర్ట ముఖ్య అధికారుల నుంచి గ్రీన్ వస్తే అక్టోబర్ 10న నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నది. 2018లో సీఎం కేసీఆర్ శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లగా అప్పడు కూడా నవంబర్ 10న నోటిఫికేషన్ వచ్చింది. అదే విధంగా ఈసారి నెల రోజుల ముందే నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తున్నది.
కేంద్ర ఎన్నికల సంఘం స్పీడ్
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం అందుకు అనుగుణంగా అధికారులను బదిలీ చేస్తున్నది. అధికారులు, ఉద్యోగుల బదిలీలతో పాటు కొత్త పోస్టింగ్‌లపై ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తున్నది. సొంత జిల్లాల్లో పని చేయకూడదని, మూడేళ్లకుపైగా అక్కడే కొనసాగకూడదని సూచించింది. శాసనసభ ఎన్నికలకు అనుగుణంగానే రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులు తమ విధులు నిర్వహించాల్సి ఉంటుందని సీఈసీ పేర్కొంది.
బదిలీలపై నజర్
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ట్రాన్స్ ఫర్ చేసేందుకు సిద్ధమవుతున్నది. జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వహించే నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వీరితో పాటు ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులను కూడా ట్రాన్స్ ఫర్ చేయనుంది. రాష్ట్రంలో సుమారు 4వేల మంది ప్రభుత్వ సిబ్బంది, ఉద్యోగుల బదిలీలకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన ముగించుకొని రాగానే ఈ ట్రాన్స్‌ఫర్స్‌పై అమోద ముద్రవేయనున్నట్లు సమాచారం. అలాగే కొత్తగా పోస్టింగ్‌లు కూడా ఉంటాయని తెలుస్తున్నది.
మరో నాలుగు రాష్ట్రాల్లో కూడా
తెలంగాణతో పాటే మరో నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరిలో ముగియనుంది. ఇందులో మధ్యప్రదేశ్ జనవరి 6, మిజోరాం డిసెంబర్ 17, ఛత్తీస్‌గఢ్ జనవరి 3, రాజస్థాన్ అసెంబ్లీ జనవరి 14వరకు కొనసాగనుంది. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్లను కూడా అక్టోబర్‌లోనే జారీ చేయాలని సీఈసీ భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది.