Poll Tracker Survey : దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి పెరిగింది. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో పార్టీలన్నీ బిజీబిజీ అయిపోయాయి. అభ్యర్థుల ప్రకటనలు, మ్యానిఫెస్టో తయారీలో తలమునకలు అయ్యాయి. ఇక తెలంగాణలో ఎన్నికల హీట్ ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, మధ్యలో బీజేపీ అధిక సీట్లు గెలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి? ఏ పార్టీకి తక్కువ సీట్లు వస్తాయి? అనే దానిపై ఇప్పటికే పలు సర్వేలు తమ నివేదికలను వెల్లడించాయి. తాజాగా తెలంగాణ ట్రాకర్ పోల్ అనే సంస్థ సర్వే నిర్వహించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సంస్థ మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు గాను 12 స్థానాల్లో సర్వే నిర్వహించింది.
ఈ 12 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గుచూపారని మొత్తం ఓట్ల శాతంలో కాంగ్రెస్ పార్టీకి 46 శాతం ఓటర్లు మద్దతుగా ఉన్నారని పేర్కొంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ స్థానాల్లో ఉండబోతోందని వెల్లడించింది. ఇక రెండో స్థానంలో బీజేపీ నిలుస్తుందని, ఆ పార్టీకి 30 శాతం ఓట్లు వస్తాయని సర్వే ఫలితాల్లో తేలిందని పేర్కొంది.
ఇక పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కాక తప్పదని సర్వే చెబుతోంది. గతంలో 9 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీకి ఈ సారి 22 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది.