Asif Ali Zardari : టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతోంది. ఏఐ వంటి కొత్త సాంకేతికత రావడమే కాదు.. అంతరిక్షానికి ప్రతీ రోజూ వెళ్లొచ్చే పరిస్థితులు రాబోతున్నాయి. ఇంతటి సాంకేతిక యుగంలోనూ మూఢనమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. సాధారణ ప్రజలే కాదు వీటి బారిన దేశ అధ్యక్షులు సైతం పడ్డారంటే నిజంగా విడ్డూరమే. ఉన్నత చదువులు చదివిన వారు సైతం ఇలా మూఢంగా ప్రవర్తించడం ఆశ్చర్యకరమే. ప్రజల్లో శాస్త్రీయ దృక్పధాలను పెంచాల్సిన పాలకులు సైతం అంధవిశ్వాసాల్లో మునిగిపోవడం దురదృష్టకరమే. ఇంతకీ ఆ పాక్ అధ్యక్షుడు ఎవరో, ఆయన చేసిన పని ఏంటో చదవండి..
ఈ అత్యంత ఆసక్తికర, విస్మయకర విషయాలను పాకిస్తాన్ వార్త పత్రిక ‘డాన్’లో ప్రచురించింది. ఆ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ. ఆయన 1955లో కరాచీలోని సింధ్-బలూచ్ జర్దారీ వంశంలో జన్మించారు. ఆసిఫ్ అలీ తండ్రి హకీమ్ అలీ ఒక తెగ నాయకుడు. అందుకే ఆసిఫ్ అలీకి చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు ఎక్కువే. అతడి భార్య బెనిజిర్ భుట్టో అని మనకు తెలిసిందే. ఈమె ప్రధానిగా పనిచేశారు. 2008లో కొందరు దుండగులు ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత ఆసిఫ్ అలీ పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యారు.
ఆసిఫ్ అలీ జర్దారీ ఉన్నత కుటుంబం నుంచే వచ్చినప్పటికీ రాజకీయాల్లో మొదట్లో ఆయన కెరీర్ పెద్దగా ముందుకువెళ్లలేదు. 1983లో ఆయన సింధ్ నవబ్షా నుంచి జిల్లా కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమై రియల్ ఎస్టేట్ వ్యాపారం వైపు ప్రయత్నించారు. అయితే బెనిజిర్ భుట్టోతో వివాహం తర్వాత ఆయన మళ్లీ రాజకీయాల వైపు మళ్లాడు. 2008లో బెనిజిర్ హత్యకు గురైన తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యారు. అయితే ఏవో కొన్ని కారణాల వల్ల ఆయనలో చేతబడి భయం పెరిగిపోయింది. ఆ తర్వాత దీనిని నివారించేందుకు ఎవరో చెప్పారని ఓ పని చేయడం ప్రారంభించారు.
జర్దారీకి చేతబడి భయం రోజురోజుకూ పెరిగిపోతుండడంతో.. ఆయన ఇంట్లో దాదాపు ప్రతీ రోజూ ఓ నల్ల మేకను బలి ఇచ్చేవాడు. తద్వారా చేతబడి నుంచి తాను తప్పించుకోవచ్చని భావించాడట. ఇక ఆ మాంసాన్ని పేదలకు పంచిపెట్టేవాడు. ఇదే విషయాన్ని పాక్ అధ్యక్ష ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ ప్రెసిడెంట్ సాదికా ధ్రువీకరించారు. ‘ జర్దారీ నల్లమేకను బలి ఇవ్వడం నేను చూశాను. కాకపోతే రోజూ కాదు అప్పుడప్పుడు చేసేవారు’ అని చెప్పారు. అలాగే యాంటీసెప్టిక్ లక్షణాల కోసం తన ఇంటి పరిసరాల్లో ఒక వేప చెట్టును కూడా నాటించాడని ఆయన తెలిపారు. ఇక జర్దారీ అధ్యక్ష పదవి బాధ్యతలు ముగిశాక.. ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి రావడంతో జర్దారీ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లింది.