Praneeth Rao : తెలంగాణలో ప్రణీత్ రావు అనే డీఎస్పీ సస్పెన్షన్ చర్చనీయాంశమైంది. ఆయన ఎస్ఐబీలో ఉంటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు చక్కబెట్టారు. టెర్రరిస్టులు, నక్సలైట్లపై చేయాల్సిన ట్యాపింగ్ ను రాజకీయ నాయకులపై ప్రయోగించారు. కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని మళ్లీ కేసీఆరే సీఎం అవుతారనే గట్టి నమ్మకంతో అధికారికంగా విచ్చలవిడితనంతో అధికార దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఆ కథంతా బయటపడుతోంది.
ఒక డీఎస్పీ ఇంత తతంగమంతా నడిపించగలడా? అనే అనుమానం అందరిలో కలుగవచ్చు. అయితే అసలు బాసులు వేరే ఉన్నారు. రిటైర్ అయినా ఇంటలిజెన్స్ లో కీలక పాత్ర పోషించినా ప్రభాకర్ రావు అనే పెద్దమనిషి.. అటు కేసీఆర్ ఫ్యామిలీకి.. ఇటు ట్యాపింగ్ కు మధ్య అనుసంధానకర్త. కేసీఆర్ ఓడిపోగానే మొదటగా రాజీనామా చేసింది ఆయనే. దీంతో వెంటనే ప్రణీత్ రావు తన ఆధీనంలో ఉన్న రికార్డులన్నంటినీ చెరిపివేశారు. సీసీ కెమెరాలను ఆఫీస్ లో ఆపుచేయించి మరీ.. ఈ పని చేశారు. ఇప్పుడు వాటిని రీట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
వాస్తవానికి ప్రణీత్ రావు ఓ ఎస్సై మాత్రమే. ఆయన బ్యాచ్ లో అందరూ ఎస్సైలు అయితే ఆయన ఒక్కడికే డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చారు. ట్యాపింగ్ పనులు చేయించుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల కాలంలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారు. అప్పటి ఏపీ సీఎం ఫోన్ ను ట్యాప్ చేశారు. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత ఎంతో మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులకు కూడా ట్యాపింగ్ తోనే వల వేశారన్న అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ విషయాలు బయటపడితే వ్యవహారం తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయి.