
Special Parliament Sessions :
ఢిల్లీలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ ప్రత్యేక సమావేశాలు కొనసాగనున్నాయి. కాగా పాత పార్లమెంట్ ప్రస్థానంపై ఉభయ సభల్లో చర్చ ప్రారంభమైంది. అయితే లోక్ సభ ప్రారంభంలోనే టెక్నికల్ ఇష్యూ తలెత్తడంతో కొంత గందరగోళం నెలకొంది. కాగా, ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, ఎంపీలు, కాంగ్రెస్ నేత సోనియాగాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ కొత్త భారత్ ను కొత్త పార్లమెంట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తానని ప్రకటించారు. చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన సమయమిదని అభిప్రాయపడ్డారు. చారిత్రక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతున్నాం. 75 ఏండ్ల ప్రయాణం ఎంతో గర్వకారణమైందని పేర్కొన్నారు. కొత్త భవనంలోకి వెళ్తున్నప్పటికీ పాత భవనం భావితరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఇక చంద్రయాన్ 3 విజయవంతంతో మనమెంటో ప్రపంచానికి తెలియజేప్పామని అభిప్రాయపడ్డారు.
సమష్టి కృషి వల్లే జీ 20 సదస్సు విజయవంతమైందన్నారు. ఈ సందర్భంగా మోడీ పార్లమెంట్ లో ఈ విధంగా మాట్లాడారు. జీ20లో అఫ్రికా యూనియన్ ను భాగస్వామిని చేశాం. జీ20 విజయాన్ని ప్రపంచాధినేతలు కొనియాడారు. భారత్ సత్తా వారికి తెలిసింది. భారత్ పురోగతిని ఇప్పుడు ప్రపంచమంతా కొనియాడుతున్నది. ఆధునిక భారత్ దిశగా దేశం అడుగులు వేస్తున్నది. అనేక రంగాల్లో భారత్ గణనీయంగా అభివృద్ధి చెందిందని మోదీ తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు కూడా సహకరించాలని ఆయన కోరారు. పాతపార్లమెంట్ లో ఇది చివరి సమావేశమని, రేపటి నుంచి కొత్త పార్లమెంట్ లోకి మారబోతున్నామని తెలిపారు.వినాయక చవితి సందర్భంగా కొత్త పార్లమెంట్ లోకి అడుగు పెట్టబోతుండడం ఆనందంగా ఉందని చెప్పారు. భారత కీర్తి పతాక మరోస్థాయికి వెళ్లిందని అభిప్రాయపడ్డారు.
భారతీయుల స్వేదం, డబ్బుతో ఈ కొత్త పార్లమెంట్ ను నిర్మించాం. ఈ పార్లమెంట్ భవనం అందరినీ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది. దేశం అభివృద్ధికి చిహ్నంగా ఇది నిలవబోతున్నది. పాత పార్లమెంట్ కు వీడ్కోలు పలకడం భావోద్వేగానికి గురిచేస్తున్నది. పాత పార్లమెంట్ ను ప్రజల సందర్శనార్థం తెరిచే ఉంచుతాం. ఇక నయా భారత్ ను ప్రజల ముందుంచబోతున్నాం. భారత్ నిర్మాణాన్ని అందరం ఘనంగా చెప్పుకోవాలి. కొత్త భవనంలోకి వెళ్లినా.. పాత భవనం దేశ ప్రజలందరికీ నిరంతర ప్రేరణలా ఉంటుంది.