MLA Seethakka రాష్ట్రంలో ఎన్నికల హీట్ మొదలైంది. ఎవరిది ఏ స్థానం? ఎవరు మంత్రి? ఎవరు ముఖ్యమంత్రి? లాంటి క్వశ్చన్స్ ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు ఎన్ఆర్ఐల నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యలో ఒక తాజా వాదనకు తెరలేచింది. గిరిజన మహిళగా, జన హృదయ నేతగా మాజీ మావోయిస్ట్ సీతక్క కూడా ముఖ్యమంత్రిని అయ్యే ఛాన్స్ ఉందని రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐలతో చెప్పడం ఇప్పుడు తీవ్రమైన చర్చుకు దారి తీసింది. కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంది. ముఖ్యమైన నాయకులను చేర్చుకుంటూ గత వైభవాన్ని అందిపుచ్చుకునేందుకు అన్ని విధాలుగా కష్టపడుతోంది. గతంలో కప్పల తక్కెడగా ఉన్న పార్టీ ప్రస్తుతం కలిసి మెలిసి పని చేస్తుంది. ఈ నేపథ్యంలో అధికార పీఠంపై ఎవరుంటారన్న వాదన వినిపిస్తుంది.
ఈ నేపథ్యలో సీతక్క అలియాస్ దాసరి అనసూయ పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చేందుకు ఎన్ఆర్ఐలను కలుపుకుపోవాలనే ఉద్దేశ్యంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యూఎస్ లోని ఎన్ఆర్ఐలతో సమావేశం అయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మొదట తానా(TANA) వేడుకల్లో పాల్గొని తర్వాత ఎన్ఆర్ఐలతో సమావేశం నిర్వహించారు. ఇందులో వారి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘రాష్ట్రంలో 18 శాతం ఉన్న ఎస్సీల నుంచి సీఎల్పీ నేత భట్టిని సీఎం అభ్యర్థిగా ఫోకస్ చేస్తున్నారు. మరి 12 శాతం ఎస్టీలు ఉన్న జనాభా నుంచి వచ్చిన సీతక్కను ఉప ముఖ్యమంత్రిగా ఫోకస్ చేస్తారా?’ అని ఒక ఎన్ఆర్ఐ ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీ బిగ్ పిక్చర్స్ చూడడం లేదు. 53 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ ప్రెసిడెంట్ గా పార్టీ చేసింది.
ప్రస్తుతం దేశంలో 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మూడు చోట్ల సీఎంలు ఓబీసీలే. ఎస్సీ, ఎస్టీ మైనార్టీల విషయంలో పార్టీ ఒక స్పష్టమైన వైఖరితో ఉంది. అయితే, సీఎం అభ్యర్థిని ఫస్టే ప్రకటించడం పార్టీ సిద్ధాంతానికి విరుద్ధం కాబట్టి పేరు ముందే చెప్పలేం. అయినా మీ సూచనలను పరిగణలోకి తీసుకుంటాం. మీరు సీతక్కను డిప్యూటీ సీఎం చేస్తారని అడిగారు కదా? సందర్భం వస్తే ఆమెనే సీఎం కూడా కావచ్చు.’ అంటూ సమాధానం ఇచ్చారు. పేదలు, దళితులు, గిరిజనుల అభ్యున్నతికి పార్టీ ఒక పాలసీతో ముందుకెళ్తుందని ఆయన చెప్పారు. ఏపీలో పోలవరం ప్రాజెక్ట్, రాజధానిగా అమరావతి నిర్మాణం ఒక్క కాంగ్రెస్ వల్లే అవుతుందని రేవంత్ అన్నాడు. ఏపీ కంటే ముందే జరగనున్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా ఎన్ఆర్ఐలు చొరవ చూపాలని రేవంత్ రెడ్డి కోరారు.