
ఆపదలో ఉన్నవాళ్లకు అండగా నేనున్నానంటూ ప్రజల హృదయాలలో హీరోగా వెలుగొందుతున్న విలక్షణ నటుడు సోనూ సూద్ తాజాగా ” ఫతే ” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. విలన్ గా అత్యధిక చిత్రాల్లో నటించిన సోనూ సూద్ కు హీరోగా చాలా అవకాశాలే వచ్చాయి. ముఖ్యంగా కరోనా కష్టకాలం తర్వాత సోనూ సూద్ లోని మానవత్వాన్ని చూసిన పలువురు ఆయన్ని రియల్ హీరోగా అభివర్ణిస్తూ స్క్రిప్ట్ లను చేసుకున్నారు కూడా.
అయితే వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోకుండా నచ్చిన కథలను మాత్రమే చేస్తున్నాడు. అలా మెచ్చిన స్క్రిప్ట్ ” ఫతే ” . ఈ సినిమా ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం సోనూ సూద్ చూస్తున్నాడు. తన సినిమాలో విలన్ గా నటించే అవకాశం నటనపై ఆసక్తి ఉన్నవాళ్లకు ఇవ్వాలని భావించిన సోనూ ఆమేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.
విలన్ పాత్రలో నటించాలని ఆశపడే ఔత్సాహికులకు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించాడు సోనూ సూద్. సోనూ సూద్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన విషయం వైరల్ గా మారింది. ఇంకేముంది పలువురు సోనూ సూద్ సినిమాలో నటించాలని ఆశపడటం ఖాయం …… పోటీ పడటం కూడా ఖాయమే ! అయితే ఆ అదృష్టవంతుడు ఎవరు ? అన్నది కొద్ది రోజులు అయితే కానీ తెలీదు. ఇంకెందుకు ఆలస్యం నటన మీద ఆసక్తి ఉన్నవాళ్లు మీ ప్రయత్నాలు మీరు చేయండి …….. అదృష్టాన్ని పరీక్షించుకోండి.