Star Heroine Injured : నటి ప్రియాంక చోప్రా గాయపడింది. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది బ్లఫ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతోంది. షూటింగ్లో భాగంగా గాయపడినట్లు ప్రియాంక స్వయంగా వెల్లడించింది. ఆమె గాయాలతో ఉన్న ఫొటోలను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసుకుంది. ‘వృత్తి పరమైన జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలు’ అంటూ గాయపడిన ఫొటోలను ప్రియాంక తన ఫ్యాన్స్ తో పంచుకుంది.
ముఖం, మెడ, పెదవిపై గాయాలైనట్లు ఫొటోలు పరిశీలిస్తే అర్థం అవుతోంది. ప్రస్తుతం ప్రియాంక బాగానే ఉందని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ప్రియాంకకు గాయం అయిన వెంటనే చిత్ర బృందం షూటింగ్‌ను నిలిపివేసింది. అనంతరం చికిత్స కోసం ఆమెను సిడ్నీకి తరలించగా, అక్కడ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.
‘ది బ్లఫ్’ చిత్రాన్ని ఫ్రాంక్ ఇ ఫ్లవర్ తెరెక్కిస్తున్నారు. ‘అవెంజర్స్’ లాంటి భారీ చిత్రాలను రూపొందించిన రుస్సో బ్రదర్స్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూర్తి యాక్షన్ మూవీగా ‘ది బ్లఫ్’ ఉండబోతోంది. నిపుణుల పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్ షూటింగ్ సమయంలోనే ప్రియాంక గాయపడినట్లు తెలుస్తోంది. ఈ మూవీతో పాటు ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే మరో యాక్షన్ కామెడీ మూవీలో ప్రియాంక నటించనుంది. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత కొంత విరామం తీసుకోవాలని ప్రియాంక కోరుకుంటుందట. అయితే, అప్పటికే ‘ది బ్లఫ్’ మూవీకి కాల్షీట్స్ కేటాయించడంతో వెంటనే షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చింది.