- ఇక అరెస్టేనా..?

YS Avinash Reddy : ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీ సీఎం జగన్ సోదరుడు, పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మళ్లీ సీబీఐ నుంచి పిలుపు వచ్చింది. వివేకా హత్య కేసులో ఆయన పాత్ర ఉందని సీబీఐ అనుమానిస్తున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం 11 గంటలకు విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ అంశం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక అవినాశ్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం జరుగుతున్నది.
హైదరాబాద్ లోనే విచారణ..
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ లోని తమ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరవ్వాలని సీబీఐ ఆదేశించింది. వివేకా హత్య కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పిలిచిందా.. లేక అరెస్ట్ చేయబోతుందా అనేది ఇప్పుడు వైసీపీ, టీడీపీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగుతున్నది. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ తరఫున న్యాయవాది వాదించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
వేళ్లన్నీ అవినాష్ వైపే..
మరోవైపు వివేకా హత్య కేసులో వేళ్లన్నీ అవినాష్ వైపే చూపుతున్నాయి. హత్య అనంతరం సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లుగా సీబీఐ భావిస్తున్నది. తనకు సంబంధం లేదని, సీబీఐ తన వాదనను పట్టించుకోకుండా ఏకపక్షంగా వెళ్తున్నదని అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే సీబీఐ మాత్రం తన పనితాను చేసుకుంటూ పోతున్నది. వివేకా కూతురు సునీత సైతం అవసరమైన సమయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ, దోషులకు శిక్ష పడాలని పోరాడుతున్నది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మరికొన్ని రోజుల్లో కేసు కొలిక్కి వచ్చేలా కనిపిస్తున్నది.