
Congrees : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ బిడ్డ, ఏపీ సీఎం జగన్ చెల్లెలు షర్మిల గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారు. అధికార పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ కు దగ్గరగా వెళ్తున్నారు.
వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని, దీనిపై ఇదివరకే చర్చలు పూర్తయ్యాయని ప్రచారం జరిగింది. దీనికి ఊతమిచ్చేలా ఇటీవల కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ వైఎస్ జయంతి సందర్భంగా ట్వీట్ చేశారు. ఇదే క్రమంలో కేపీసీసీ చీఫ్ డీ కే శివకుమార్ తో కూడా షర్మిల చర్చలు జరిపారు. అయితే షర్మిల మాత్రం తెలంగాణ రాజకీయాలకే పరిమితం కావాలని చూస్తున్నారు. కానీ టీ కాంగ్రెస్ నేతలు అందుకు ఒప్పుకోవడం లేదు. షర్మిల కేవలం ఏపీకే పరిమితం చేయాలని తెలంగాణలో ఆమె పెత్తనం అవసరం లేదని చెప్పుకొస్తున్నారు. ఆమెను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమిస్తే తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారు.
అయితే ఏపీలో అన్నకు వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం షర్మిలకు ఇష్టం లేనట్లుగా సమాచారం. అక్కడ గతంలో జగనన్న బాణం అంటూ పాదయాత్ర చేసిన ఇప్పుడు అదే అన్నకు వ్యతిరేకంగా పనిచేయబోనని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం దాదాపు ఖరారైందని, ఈనెల 12న కార్యక్రమం ఉంటుందని పలువురు చెబుతున్నారు. ఇందుకోసమే ఆమె వారం రోజులుగా బెంగళూరులో మకాం వేసినట్లు సమాచారం. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైనట్లే కనిపిస్తున్నది. ఈ సమయంలో షర్మిల చేరిక మరింత బలం చేకూరుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు షర్మిల ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేస్తారని, ఇందుకు అందరికీ సమ్మతమేనని చెబుతున్నారు.