
Zelensky : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ బ్రిటన్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రష్యా ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో జెలెన్ స్కీ పర్యటన తీవ్ర హైప్ ను సంతరించుకుంది. అయితే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో జెలెన్ స్కీ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ట్విటర్ ద్వారా స్పందించారు. తాను యుద్ధం కొనసాగుతున్న సమయంలో బ్రిటన్ ప్రధాని రిషీ సునాత్ తో భేటీకి అవకాశం దొరికిందని ట్విటర్ లో తెలిపారు. ఉక్రెయిన్ సైన్యం, వాయిసేన సామర్థ్యాలను పెంచుకోవడంలో యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) కీలక పాత్ర అంటూ రాసుకున్నారు ఆయన. రష్యాతో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో యూకే సహకారం ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన ఆ దేశానికి ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
అయితే జెలెన్ స్కీ పర్యటనపై రిషీ సునాక్ స్పందించారు. ఉక్రెయిన్ ను తాము ఎట్టిపరిస్థితుల్లో వదులు కోలేమని అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ఇది కీలక సమయమని బ్రిటన్ ప్రధాని చెప్పారు. ఇప్పుడు యుద్ధం ఉక్రెయిన్ భూమిలో కొనసాగుతుందని, కానీ దీని ప్రభావం మొత్తం ప్రపంచంపై ఉంటుందని తెలియజేశారు. ఈ యుద్దంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రతిఫలం దక్కకుండా చేయడమే బ్రిటన్ లక్ష్యమని ఆయన చెప్పారు.
దీనికి తోడు ఉక్రెయిన్ కు దీర్ఘ శ్రేణి క్షిపణులను సరఫరా చేసేందుకు యూకే అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. ఈ మేరకు గత గురువారం బ్రిటన్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. అయితే తనకు బ్రిటన్ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు జెలెన్ స్కీ తెలపడంతో రష్యా బ్రిటన్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.