Jasprit Bumrah : టీమిండియా స్టార్ పేసర్ జన్ ప్రీత్ బుమ్రా ఏంటో మనకు తెలిసిందే. తన బౌలింగ్ తో ప్రత్యర్థిని హడలెత్తించడం అతడికి అలవాటే. ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో చెలరేగాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 150 వికెట్ల మైలురాయిని అందుకున్న ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు. వైజాగ్ లో జరుగుతున్న రెండో టెస్ట్ లో నిప్పులు తొక్కుతూ 6 వికెట్లు కూల్చి ప్రత్యర్థి పతనాన్ని లిఖించాడు.
ఈ టెస్ట్ లో బెన్ స్టోక్స్ వికెట్ తీయడంతో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో 34 టెస్టుల్లో 150 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా, రెండో ఆసియా క్రికెటర్ గా చరిత్ర లిఖించాడు. 27 మ్యాచుల్లో పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ 150 వికెట్లు పడగొట్టి బుమ్రా కన్నా ముందున్నాడు. బుమ్రా తరువాత ఇమ్రాన్ ఖాన్ 37, షోయబ్ అక్తర్ 37 మ్యాచుల్లో ఈ ఘనత సాధించారు.
150 వికెట్లు చేరుకునేందుకు బుమ్రాకు 6781 బంతులు అవసరమయ్యాయి. బుమ్రా తరువాత ఉమేష్ యాదవ్ 7661, మహ్మద్ షమీ 7755, కపిల్ దేవ్ 8378, అశ్విన్ 8380 బంతుల్లో ఈ ఘనత సాధించారు. టెస్టుల్లో బుమ్రాకు ఐదు వికెట్ల ఘనత అందుకోవడం ఇది పదోసారి. దక్షిణాఫ్రికా గడ్డపై మూడుసార్లు, వెస్టీండీస్ గడ్డపై రెండు సార్లు, ఇంగ్లండ్ గడ్డపై రెండు సార్లు, భారత గడ్డపై రెండు సార్లు, ఆసీస్ గడ్డపై రెండు సార్లు బుమ్రా ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు.
ఎలాంటి పిచ్ అయినా బుమ్రా చెలరేగి ఆడతాడు. ప్రత్యర్థికి గుండెలు అదిరేలా బౌలింగ్ చేస్తాడు. దీంతో బుమ్రా అసాధారణ బౌలర్ అని పొగుడుతుంటారు. బుల్లెట్ యార్కర్లతో ప్రత్యర్థిని తిప్పలు పెట్టడంలో దిట్ట. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేస్తుంటాడు. బుల్లెట్ యార్కర్లతో ఓలీపోప్ క్లీన్ బౌల్డ్ కాగా స్వింగర్లకు జోరూట్, జానీ బెయిర్ స్టో టామ్ హార్ట్ లీ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.