Ambati Rambabu : ఏపీలో మంత్రి అంబటి రాయుడి తీరుపై మరోసారి నెటిజన్లు మండిపడుతన్నారు. తాజాగా సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చేసిన ట్వీట్ కు అంబటి చేసిన రీ ట్వీట్ వివాదాస్పదమైంది. వైసీపీ నేతల మనస్తత్వాన్ని ఇది మరోసారి బయటపెట్టిందనే అభిప్రాయం వినిపిస్తున్నది. అధికారం ఉంది కదా అని ఎదుటివారిని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వెనుక నడుస్తున్న వ్యవహారం, కేసులు, న్యాయస్థానంలో ఆయనకు ఊరట దక్కకపోవడంపై సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కొన్ని రోజులగా నిరాశలో ఉన్నారు. ఆయన తన న్యాయపోరాటం కొనసాగిస్తూనే వరుస ట్వీట్లు పెడుతున్నారు. ఇంతకుముందు న్యాయం లభించకపోతే కత్తి పోరాటమే మేలు అంటూ మొదటి ట్వీట్ చేశారు. తాజాగా శుక్రవారం కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. రాత్రి తరువాత తెల్లవారుతుంది. మన జీవితాల్లో వెలుతురు నింపుతుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇది చంద్రబాబు కేసును ఉద్దేశించే అని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ట్వీట్ పై అంబటి స్పందించిన తీరు టీడీపీ శ్రేణుల కోపానికి కారణమైంది. కానీ కొందరి జీవితాలు చీకట్లోనే ముగుస్తాయి అని అంబటి ట్వీట్ చేశారు.
అయితే ఇది వైసీపీ నేతల మనస్తత్వాన్ని తెలియజేస్తున్నదని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అంటే చంద్రబాబును చీకట్లోనే ఏదో చేయాలని అనుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయనపై వైసీపీ నేతల దాడులు గుర్తు చేసుకొని భయపడుతున్నారు. ఇక వైసీపీ నేత, ఏపీ స్పీకర్ అయిన తమ్మినేని సీతారాం కూడా గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా పునరుద్ధాటిస్తున్నారు. బ్లాక్ క్యాట్ కమాండో లను పక్కన పెట్టి వస్తే చంద్రబాబు ఫినిష్ అంటూ ఆయన అక్కసు వెళ్లగక్కారు. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి జడ్ ప్లస్ భద్రత లేకుండా రాజమండ్రి జైలులో కరుడుగట్టిన నేరగాళ్ల మధ్యలో ఉన్నాడని, ఇదే సమయంలో వైసీపీ నేతలు ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. స్వయంగా పార్టీ యువనేత నారా లోకేశ్ కూడా ఇదే భయాందోళనను వ్యక్తం చేశారు. మరి అంబటి తాజా ట్వీట్ కూడా చీకట్లో కలిపేస్తాం అన్నట్లుగానే ఉందని అభిప్రాయపడుతున్నారు. ఏపీలో వైసీపీ నేతలు మరి ఇంత దిగజారి బెదిరింపులకు దిగడం వారి మనస్తత్వాన్ని బయటపెడుతున్నదని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.