Black Cat Commandos : భద్రత విధుల నుంచి ‘బ్లాక్ క్యాట్’ తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రముఖుల భద్రత తీరుతెన్నులను కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోదీ ప్రభుత్వం సమీక్షించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడినట్లు, కేంద్ర హోంమత్రిత్వ శాఖ తగిన కసరత్తు చేపడుతోందని పేర్కొన్నాయి. ఇప్పటివరకూ వీఐపీలకు వ్యక్తిగత భద్రత విధుల్లో ఉన్న ఎన్ఎస్జీ కమెండోలతోపాటు ఐటీబీపీ సిబ్బందినీ ఉపసంహరించనున్నారు.
‘జడ్’ విభాగంలోని తొమ్మిది కేటగిరిల్లో ఉన్న వారి రక్షణ బాధ్యతలను సీఆర్పీఎఫ్ కు లేదా సీఐఎస్ఎఫ్ లోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎస్ఎస్ జీ)కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఉగ్రదాడులు, విపత్తుల సందర్భంగా ‘స్ట్రైక్ ఫోర్స్’గా వినియోగించుకునేందుకు 1984లో ఎస్ఎస్ జీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉండడంతో బ్లాక్ క్యాట్ కమెండోలను వీఐపీల బాధ్యతల నుంచి తప్పించాలని 2012లోనే ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ముఖ్యుల భద్రతలో 450 మంది వరకు బ్లాక్ క్యాట్ కమెండోలు ఉన్నారని సమాచారం. వారిని ఆ విధుల నుంచి ఉపసంహరించుకున్నాక, దేశంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో బృందాల వారీగా మోహరించనున్నారు.