BTech Ravi : వైఎస్ వివేకా హత్య కేసులో మాట మార్చి హైకోర్టుకు ఎక్కిన మాజీ ఐఏఎస్ అజయ్ కల్లెం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నేత బీటెక్ రవి. వైఎస్ వివేకా హత్య కేసులో స్టేట్మెంట్ చదవకుండానే సంతకం చేశావా.? అంటూ నిలదీశారు. జగన్ బెదిరింపులకు భయపడి మాట మార్చడం సిగ్గుచేటు అంటూ విమర్శించారు.
దశాబ్దాలపాటు అత్యున్నతమైన స్థాయి పదవుల్లో ఉండి ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అజయ్‌కల్లంరెడ్డి తాడేపల్లి ప్యాలెస్ బెదిరింపులకు భయపడి వివేకా హత్య కేసులో రోజుకోమాట మాట్లాడుతున్నారని బీటెక్ రవి అన్నారు. సీబీఐ అధికారులు తనతో చిట్‌చాట్ చేశారని ఒకసారి, స్టేట్‌మెంట్ ఇచ్చానని మరోసారి, ఇప్పుడు వక్రీకరించారంటూ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి? వాస్తవాలు చెప్పినందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన బెదిరింపులకు తలొగ్గి మాట మారుస్తున్నారని ఆరోపించారు.
161 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఇచ్చానన్న విషయం కూడా అజయ్‌కల్లం మరిచిపోయారా? భారతీరెడ్డి పిలుపుతో పైకివెళ్లి వచ్చిన తర్వాత వివేకా గుండెపోటుతో చనిపోయారన్న విషయం జగన్‌రెడ్డే స్వయంగా చెప్పారని అజయ్ కల్లం రెడ్డి బయట్టబయలు చేసిన తర్వాత రాష్ట్రంలో బాత్‌రూమ్ సీన్ రిపీట్ అవుతుందనే భయంతో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు చెప్పిన విధంగా నటిస్తున్నారని బీటెక్ రవి ఆరోపించారు..
తెల్లవారుజామున లోటస్‌పాండ్‌లో జరిగిన ఆంతరంగిక సమావేశంలో పాల్గొన్న అజయ్‌కల్లం… వివేకా చనిపోయారని జగన్ చెప్పిన వెంటనే ఎలా చనిపోయారని అడగలేదా? ఎన్ని గంటలకో మీటింగ్ తెలియకుండానే లోటస్‌పాండ్‌కు వెళ్లి కూర్చున్నారా? చెప్పని మాటలు చెప్పినట్లు సీబీఐ ప్రచారం చేస్తోందన్న దానిపై ఇప్పటివరకు ఎందుకు మౌనంగా ఉన్నారని బీటెక్ రవి ప్రశ్నల వర్షం కురిపించారు.