Pervez Musharraf : ‘‘బండ్లు ఓడలవుతాయి..ఓడలు బండ్లు అవుతాయి..’’ అని తెలుగు నాట నానుడి ఉంది. మనిషిని అలర్ట్ చేసే ఇలాంటి సామెతలు ఎన్నో మన దగ్గర ఉన్నాయి. కొందరు తాము అధికారంలో ఉన్నప్పుడు లేదా ఉద్యోగంలో ఉన్నప్పుడు లేదా ఆస్తులు బాగా సంపాదించినప్పుడు విర్రవీగిపోతుంటారు. తమను మించినోడు ఈ భూమండలంపై లేడని తమను తాము చక్రవర్తిలాగా ప్రవర్తిస్తుంటారు. కానీ ఇంకొందరు పాలకులైతే నియంతలాగా వ్యవహరిస్తూ అక్కడి ప్రజలను హింసిస్తూ తమ బానిసలుగా చేసుకుంటారు.
‘‘నేనొక పెద్ద పోటుగాణ్ణి..’’ అనే గర్వంతో విర్రవిగేవారి కోసం ఖురాన్ గ్రంథంలో ఓ అద్భుతమైన వాక్యం ఉంది. అదేంటంటే..‘‘భూమిపై నిక్కుతూ గర్వంతో నడవకండి..మీరు భూమిని చీల్చనూ లేరు..పర్వతాల ఎత్తుకు ఎదగనూ లేరు.’’ ఈ వ్యాక్యాన్ని చదివితే మీకు అర్థమయ్యే ఉంటుంది. మనిషి తన అధికారం, ఆస్తులను చూసి మురిసిపోయి.. ఇతరుల పట్ల దురుసుగా ఉంటే నువ్వు సాధించేది ఏమీ ఉండదు. నీ అహంకారానికి కాలమే సమాధానం చెబుతుంది..అని.
ఈ ప్రపంచంలో ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిశారు. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ చివరకు తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు. లాడెన్, గడాఫీ ఇలా ఎందరో తమ ఉనికిని లేకుండా కోల్పోయారు. ఇక మన దగ్గరి పీఎంలు, సీఎంలు అధికారంలో ఉన్నప్పుడు చెలిరేగిపోతుంటారు. కానీ ప్రజాస్వామ్యమనే ఓటు ద్వారా ప్రజలు వారి అధికార మత్తును వదిలిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇలా ఓడిన వారి రాజకీయ భవిష్యత్ భూస్థాపితం కూడా అయ్యింది.
ఇలా మితిమీరిన అధికార అహంకారంతో గతంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ కూడా విర్రవీగేవాడు. భారత్ అంటే అణువణువునా విద్వేషం పెంచుకున్న ముషారఫ్ గతంలో సైన్యాధిపతిగా ఉండేవాడు. అప్పటి అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ ను వివిధ కేసుల పేరుతో దేశం వదిలి పెట్టేలా చేసి తాను అధ్యక్షుడు అయ్యాడు. అప్పటి నుంచి అధికార దర్పంతో ప్రతీక్షణం భారత్ పై తన అక్కసు వెళ్లగక్కేవాడు. చివరకు అతడి తర్వాత వచ్చిన పాలకుల భయాన్ని దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది.
ప్రస్తుతం అతడు వీల్ ఛైర్ కే అంకితమై ఎన్నో కేసులు ఎదుర్కొంటూ దయనీయ స్థితిలో బతుకు వెళ్లదీస్తున్నాడు. నాలుగు రోజు జీవిత చక్రంలో ఓ నాలుగు ఆస్తి అంతస్తులు, పదవులు సంపాదించుకుని అహంకారంతో కళ్లు నెత్తికెక్కించుకునే ఈ జీవిత సత్యాన్ని గుర్తుంచుకుంటూ మంచిది. నువ్వెంత పోటుగాడివైనా కాలం నీకన్నా పెద్ద పోటు..ఆస్తుల కన్నా ఆప్యాయతలు ముఖ్యం..అధికారం కన్నా బంధుత్వం ప్రధానం..అహంకారం కన్నా అపన్నహస్తం అవసరం. వీటిని పాటించినవాడు ఎప్పుడూ ప్రజల్లో గుండెల్లో రాజులాగే ఉంటాడు.