- మనదేశంలోని ఉన్నతమైన చలనచిత్ర సంగీత దర్శకులలో ఒకరైన ఆదినారాయణ రావు వర్ధంతి ఇవాళ. ఆయన్ను స్మరించుకుందాం రండి
తెలుగు, తమిళ్ష్ భాషల్లోనే కాదు హిందీ సినిమాల్లో కూడా విజయవంతమైన పాటల్ని ఇచ్చారు ఆదినారాయణరావు. ఆయనకు ముందే ఎస్.రాజేశ్వరరావు, ఈమని శంకరశాస్త్రి వంటి తెలుగువారు హిందీ సినిమాలకు సంగీతం చేశారు. ఆదినారాయణరావు చేసిన “కుహు కుహు బోలే కోయలియా” పాట ఒక సంచలనం అయింది హిందీలో. ఇది తెలుగు స్వర్ణసుందరి సినిమాలో “హాయి హాయిగా ఆమని సాగే” పాట. ఈ హిందీ పాట హిందీ సినిమాల్లో వచ్చిన తొలి రాగమాలిక.
అంతర్జాతీయమైన తీరులో ఉండే గానం దక్షిణాది సినిమాలోకి వచ్చింది ఆదినారాయణరావు సంగీతంలోనే! తమిళ్ష్‌లో ఆయన సంగీతం చేసిన అడుత్తవీట్టుపెణ్ సినిమాలో “కణ్ణాలె పేసి పేసి కొల్లాదే” అని పి.బి. శ్రీనివాస్ పాడిన పాటతో అంతర్జాతీయ గానం దక్షిణాదికి వచ్చింది. ఆ పాట మట్టు (tune), వాద్య సంగీతం అంతర్జాతీయమైన తీరులో ఉంటాయి. ఆ అడుత్తవీట్టుపెణ్ సినిమాలో పి.బి. శ్రీనివాస్ గానం ఒక్క తమిళ్ష్ సినిమాకే కాదు మొత్తం దక్షిణాది సినిమా గానానికే మార్గదర్శకమయింది.
గొల్లభామ సినిమాలో తొలిసారిగా కొన్ని పాటలకు సంగీతం చేశారు ఆదినారాయణ రావు. పల్లెటూరిపిల్ల సినిమా సంగీతదర్శకుడుగా ఆయనకు తొలి సినిమా. స్వర్ణసుందరి, స్వర్ణమంజరి, సతీసక్కుబాయి, మహాకవి క్షేత్రయ్య, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరిసీతారామరాజు, భక్తతుకారాం వంటి సినిమాలకు సంగీతం చేశారు. “వస్తాడు నా రాజు ఈ రోజు” , ఘనాఘన సుందరా కరుణా రస మందిరా”, “జాబిల్లి చూసేను నిన్నూ నన్నూ”, “పిలవకురా పిలవకురా” వంటి గొప్పపాటల్ని చేశారు ఆదినారాయాణరావు.
స్వర్ణసుందరి సినిమాలో “హాయిహాయిగా ఆమని సాగె” పాట వంటి గొప్ప రాగమాలికను చేసిన ఆదినారాయణరావు 1962లో స్వర్ణమంజరి సినిమాలో “ఇదియే జీవితానందము” అనే మఱో గొప్ప రాగమాలికను చేశారు. ఘంటసాల, పి. సుశీల పాడారు. (తమిళ్ లో మంగయర్ ఉళ్ళమ్ మంగాద సెల్వమ్ “ఇదువే వాళ్విన్ ఆనందమే” అంటూ పి.బి. శ్రీనివాస్, పి. సుశీల పాడారు) భారతదేశ చలన చిత్రాల్లో వచ్చిన ఉన్నతమైన రాగమాలికల్లో రెండు ఆదినారాయణరావు చేశారు!
ఆదినారాయణరావు పాటలకు చక్కటి వాద్యసంగీతాన్ని నిర్మించేవారు. అల్లూరిసీతారామరాజు సినిమాలోని “వస్తాడు నా రాజు”, భక్త తుకారాం లోని “ఘనాఘన సుందర” పాటలు బాణీల పరంగా మాత్రమే కాకుండా వాద్యసంగీతం పరంగా కూడా విశేషమైనవి. ఈ పాటల వాద్యసంగీతంలో mood ఉంటుంది.
“భారతీయ సంగీత శాస్త్రము ఆదినారాయణీయము” పేరుతో ఒక మంచి పుస్తకం రాశారు. ఈ పుస్తకం ఈయనపోయాక చాలాకాలం తరువాత ప్రచురణం అయింది.
1914లో పుట్టి, 1991లో వెళ్లిపోయారు ఆదినారాయణరావు. తాను చేసిన గొప్ప పాటలుగా ఆయన మనతో ఎప్పుడూ ఉంటారు.
– రోచిష్మాన్
9444012279