- కెనడాలో స్థిరపడిన భారతీయుడి వీడియో వైరల్

Canada Jobs : అమెరికా, కెనడాలో ఉద్యోగాలు చేసి అక్కడే స్థిరపడాలని భావించే యువత పునరాలోచించుకోవాల్సిన అవసరమొచ్చింది. భారత్ లో నానా కష్టాలు పడి చదువుకుని విదేశాల్లోకి వెళ్లి లక్షల్లో జీతాలు పొంది, లగ్జరీ లైఫ్ అనుభవించాలనుకుని కలలుకంటూ ఉంటారు. ఇక పేరెంట్స్ కూడా మావాడు అమెరికాలో ఉంటున్నాడు.. మా అమ్మాయి కెనడాలో ఉద్యోగం చేస్తోందంటూ గొప్పలకు పోతుంటారు. దూరపు కొండలు నునుపు అనే సామెతను ఒంటపట్టించుకున్న నేటి తల్లిదండ్రులు, పిల్లలు.. విదేశాల్లో ఉద్యోగాలు అంటూ మోసపోతున్నారు.
అమెరికా, కెనడాల్లో ప్రస్తుత పరిస్థితిపై కెనడాలో సెటిల్ అయిన తెలుగు వ్యక్తి అనిల్ కుమార్ లింగమనేని తన యూట్యూబ్ చానల్ ‘కెనడా ఫ్లాష్ న్యూస్’ లో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులను నిర్మోహమాటంగా వెల్లడించారు. తెలుగు ప్రజలు కెనడాకు రావొద్దని, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువని, ఆ ట్యాక్స్ అంటూ, ఈ ట్యాక్స్ అంటూ మనకు వచ్చే బోడి జీతానికి ఐదారు వేలు కూడా మిగలదని చెప్పారు. ఇక్కడి కంటే ఏ ఇరాక్ కో, ఉక్రెయిన్ కో వెళ్తే కనీసం కొంత మొత్తమైనా ఇంటికి పంపించవచ్చన్నారు.
కెనడాలో ఉద్యోగాలు లేవని..అంతా కన్సల్టెన్సీల మోసమని..ఉద్యోగం పేరిట లక్షలు గుంజుతారని.. కెనడాకు రావడం కంటే తిరుపతి, హైదరాబాద్ పాతబస్తీలో గాజులు అమ్ముకుంటే నయమని ఎద్దేవా చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విధానాల వల్ల ఇక్కడ చక్కగా ఉద్యోగం చేయాలనుకునేవారికి నష్టం జరుగుతోందన్నారు. ఇష్టరీతిన రిఫ్యూజీలను దేశానికి రప్పిస్తూ కెనడాను సంకినాకిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ట్రూడో మారాలని కోరారు. తెలుగు విద్యార్థులు ఆశల పల్లకిలో ఉండొద్దని..కెనడాలోని చుట్టాల వద్దకు వచ్చి ఉద్యోగం చూపించండి అని కూడా అడగొద్దన్నారు. ఇక్కడ మిగిలింది బొచ్చు, బోషాణమే అన్నారు. కెనడాలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు ఆయన చెప్పుకురావడం గమనార్హం.