CBN Vs JAGAN : దౌర్భాగ్యం కలిసొచ్చి జగన్ సీఎం అయ్యారు.. రైతులు నాశనమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశంలో నిప్పులు చెరిగారు. మంగళవారం రాత్రి మాట్లాడిన చంద్రబాబు.. ఈ సందర్భంగా జగన్ పాలనలో అన్నదాతలు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగును సీఎం జగన్ చంపేశాడని ఆరోపించారు. రైతును నట్టేట ముంచేశాడు … జగన్‍కు వ్యవసాయంపై అవగాహన లేదు … గోదావరి జిల్లాల మొదలు రాయలసీమ వరకు జగన్ పాలనలో ఏ ఒక్క రైతైనా బాగున్నాడా..? అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఆహార అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు మారాలి.. జగన్ పాలనలో పుష్కలంగా సాగవుతున్న ఏకైక పంట గంజాయి… ఈ దుర్మార్గుడి పాలనలో గంజాయి తప్ప మరో పంట సాగయ్యే పరిస్థితి లేదు… రైతుల ఆత్మహత్యల్లో ఏపీది దేశంలో మూడో స్థానం… తప్పుడు లెక్కలు చూపడంలో జగన్ సిద్దహస్తుడు… ఏపీలో 93 శాతం రైతాంగం అప్పుల పాలైంది… దేశంలో సగటు రైతు అప్పు రూ.74 వేలు ఉంటే ఏపీలో సగటు రైతు అప్పు రూ.2,45,554 … పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతాయి … చేతగాని ప్రభుత్వానికి నాలుగేళ్ల జగన్ పాలనే నిదర్శనం ’ అని తూర్పారపట్టారు.
‘ఏపీలో భూముల ధరలు.. వ్యవసాయంపై కేసీఆర్ కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ఏపీలో ఎకరం భూమి అమ్మితే హైదరాబాద్‍లో మూడెకరాలు కొనేవాళ్లు.. ఇప్పుడు హైదరాబాద్‍లో ఒక ఎకరం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనే దుస్థితి ఏర్పడింది … కరోనా సమయంలో అందరూ హాలిడే తీసుకుంటే ఒక్క రైతే పంట పండించి దేశానికి అన్నం పెట్టాడు… రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తే ధాన్యం సంచులు అందుబాటులో ఉండవు.. ఉన్న సంచులకు రంధ్రాలు ఉంటాయి … రైతులను పట్టుకుని ఓ మంత్రి వెర్రిపప్ప అంటాడా..? ’ అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
జగన్ పాలన వ్యవస్థపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ‘గోనే సంచులు మొదలు మిల్లర్ల వరకు ప్రతీ దానిలో దగా, మోసం… సీమలో హార్టీ కల్చర్.. కోస్తాలో ఆక్వాకల్చర్ కు ప్రాధాన్యమిచ్చాం… ఇప్పుడు హార్టీకల్చర్, ఆక్వాకల్చర్ సంక్షోభంలో ఉన్నాయి… ఆక్వా రైతాంగానికి టీడీపీ ప్రభుత్వం యూనిట్ రూ.2కు విద్యుత్ ఇచ్చింది.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్ రూ.3.8 చేశాడు… పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను ఆక్వా చెరువులకు పారించాం… ప్రతిపక్షాలపై కేసులు..వనరుల దోపిడే జగన్ పాలన … అడ్డచూపులు.. దొంగ చూపులు తప్ప ఈ సీఎంకు ఇక వేటిపైనా శ్రద్ద లేదు … జగన్ అధికార వ్యామోహం రాష్ట్రానికి శాపంగా మారింది … వ్యవస్థలను చంపేసి రివర్స్ గేర్‍లో నడిపిస్తున్నారు … సంక్షోభానికి కారణమైన జగన్‍కు పరిపాలించే అర్హత ఎక్కడిది..? ఆర్బీకేలు దోపిడీ కేంద్రాలుగా మారాయి … రైతులపై జగన్ ప్రభుత్వం అప్పుల భారం మోపింది … జగన్ మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు… ’ అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో టమాట వేయడం మానేశారని.. ఇప్పుడు టమాట ధరలు పెరగడానికి ఇదే కారణం అని చంద్రబాబు రైతుల ఆవేదనను కళ్లకు కట్టారు. ముందుచూపుతో వ్యవహరిస్తే ఈ తిప్పులు ఉండేవి కావన్నారు. సీఎం జగన్‍కు ముందుచూపు లేదు.. ఎప్పుడూ పక్కచూపులేన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధిని చంద్రబాబు ప్రస్తావించారు. ‘టీడీపీ హయంలో 23 వేల ట్రాక్టర్లు ఇచ్చాం.. ఇప్పుడు 6 వేల ట్రాక్టర్లు కూడా ఇవ్వలేదు. సూక్ష్మ పోషకాలు ఇవ్వట్లేదు… భూసార పరీక్షల్లేవు.. పంట దిగుబడి తగ్గింది.. నీటి సెస్సు వెయ్యి లీటర్లకు రూ.12 నుంచి రూ.120చేశారు.. కృష్ణా-గోదావరి నదులున్న ఈ రాష్ట్రంలో నీటిపై విపరీతమైన సెస్సులా? ఫుడ్ ప్రాసెసింగ్.. కోల్డ్ చెయిన్ లింకేజీ వ్యవస్థలను పటిష్టపరచాలని కృషి చేశాం.. దౌర్భాగ్యం కలిసొచ్చి జగన్ సీఎం అయ్యారు.. రైతులు నాశనమయ్యారు.. రాజధానిలో రైతుల భూమి వేరొకరికి దానం చేసిన జగన్ దానకర్ణుడా? అంత దానం చేసే గుణమే ఉంటే తన భూమి ఇవ్వొచ్చుగా? కోర్టుల్లో అనుమతి వచ్చిందా? ఏపీ రాజధాని ఏదంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి.. అమరావతి రైతులపై జగన్‍కు ఎందుకు కక్ష..?’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పుల వర్షం కురిపించారు.