
Guntur Karaam : ప్రిన్స్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో సంక్రాంతికి కానుకగా వస్తున్న ‘గుంటూరు కారం’పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సంక్రాంతి విజేతగా నిలిచేది తమ హీరో సినిమానే అని ఢంకా బజాయించి చెబుతున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గకుండా మేకర్స్ కూడా దానికి తగ్గట్టుగా సినిమా నిర్మాణం నుంచి రిలీజ్ వరకు అన్ని ఏర్పాట్లు ఘనంగానే చేస్తున్నారు.
ఈక్రమంలో జనవరి 6న (శనివారం) హైదరాబాద్ లో గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. అక్కడే ట్రైలర్ రిలీజ్ చేద్దామనుకున్నారు. అఖరి నిమిషంలో పర్మిషన్ రాకపోవడంతో కార్యక్రమం వాయిదా పడింది. త్వరలోనే కొత్త డేట్, వేదిక వెల్లడి చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా ఈరోజు సాయంత్రం(7న) ట్రైలర్ బయటకు వదిలేస్తున్నారు. దీంతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చేయడానికి మూవీ యూనిట్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి గుంటూరులో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది? అనే దిశా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 9న గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగవచ్చని సమాచారం. అక్కడ పర్మిషన్ తీసుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. వేదిక కూడా దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అన్నీ అంత సవ్యంగా సాగితే ఈ విషయాన్ని అధికారికంగా మేకర్స్ ప్రకటించనున్నారు. ప్రీ రిలీజ్ వేడుకను మినహాయిస్తే ఈ సినిమాకు ప్రమోషన్ ఈవెంట్స్ ఏవీ చేయడం లేదు. ఓ గ్రూపు ఇంటర్వ్యూ చేసి అన్ని చానళ్లకు ఇస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే సినిమాపై జనాల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రమోషన్లు చేయకున్నా దుమ్మురేపుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.