![Pawan Kalyan Speech](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/pawan-kalyan-assembly-speech-441-1719044156.jpg)
Pawan Kalyan speech : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. నిన్న (జూన్ 21) సభలో సభ్యుల ప్రమాణ స్వీకారం జరగగా.. నేడు (జూన్ 22) స్పీకర్ ఎన్నిక, స్పీకర్ ను ఉద్దేశించి సభ్యుల స్పీచ్ జరిగింది. స్పీకర్ గా ఎటువంటి పోటీ లేకపోవడంతో చింతకాయల అయ్యన్నపాత్రుడి ఎంపిక ఖరారైంది. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న నేత అయ్యన్న పాత్రుడు. తనకు 20 సంవత్సరాల వయస్సు నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అప్పటి నుంచి ఆయన పచ్చ జెండానే మోశారు. ఏనాడు పార్టీ మారడం గానీ, ఇతర పార్టీల బెదిరింపులకు లొంగడం కానీ చేయలేదు.
ఆయన ఎంపిక జరిగిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయను గౌరవంగా చైర్ లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత హౌజ్ ఆఫ్ ద లీడర్ చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యన్న పాత్రుడిని ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన గురించి తనకు తెలిసిన సమాచారం మొత్తం వివరించారు. ఆయన చదువు, రాజకీయాల్లోకి ఆయన పయనం, టీడీపీతో అయ్యన్న పాత్రుడికి ఉన్న అనుబంధం అన్నింటినీ వివరించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీకర్ ను ఉద్దేశించి మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ స్పీకర్ ను ఉద్దేశించి మాట్లాడడం నవ్వులు పూయించింది. సాధారణంగా హౌజ్ లో పాలక పక్షం ప్రతిపక్షం నాయకులు ఒకరినొకరు ధూషించుకుంటారు (తిట్టుకుంటారు). ఒక్కోసారి దాడులకు కూడా పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వారిని వారిస్తాడు. తండ్రి పాత్రలో ఉన్న స్పీకర్ ఇరు వైపులా నాయకులకు నచ్చ చెప్తారు. ఈ నేపథ్యంలో పవన్ ‘అధ్యక్ష ఈ రోజు నుంచి మీరు తిట్టుకోరని, కేవలం తిట్టుకునే వారిని మాత్రం వారిస్తారని’ అంటూ నవ్వులు పూయించారు.
అసెంబ్లీలో మొదటి సారి అందునా మొదటి రోజు కూర్చున్న పవన్ కళ్యాణ్ అనుభవం ఉన్న నేతగా సభలో మాట్లాడారు. ఆయన స్పీచ్ చాలా హుందాగా సాగింది. అక్కడక్కడ జోక్స్ వేస్తూ.. తన గురించి చెప్తూ.. చంద్రబాబు గురించి మాట్లాడుతూ సరదాగా స్పీచ్ ను కంప్లీట్ చేశారు.