![BRS](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/04/brs-party.webp)
BRS : తెలంగాణో పదేళ్ల పాటు అధికారం చెలాయించిన కేసీఆర్ పార్టీ బీఆరఎస్ కు మొన్నటి అసెంబ్లీ ఫలితాలు ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి. మరి అంతటి ఘోరమైన ఫలితాలు వస్తాయని బహుశా కేసీఆర్ తో పాటు ఆ పార్టీ నాయకులు కూడా ఊహించి ఉండరు. బీఆర్ఎస్ ఎలా అయ్యిందంటే ఆకాశం నుంచి ఒక్కసారిగా కిందపడినట్లయ్యింది. దీని నుంచి తేరుకోని కేసీఆర్ ఇంకా తానే సీఎంననే విధంగా ప్రెస్ మీట్లలో వ్యవహరించాడు. ఇక ఎల్లుండి రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా బీఆర్ఎస్ కు కనీసం ఊరడించే స్థాయిలో కూడా ఉండబోవని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఒక్క సీటూ రాకపోతే భవిష్యత్ బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటనే సందేహాలు మొదలయ్యాయి.
తెలంగాణలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా సీట్లు సాధిస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ ను లెక్కలోకి తీసుకోలేదు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు కత్తి, డాలు తిప్పుతున్న కేసీఆర్ పార్టీకి ఒక్క ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టత నిచ్చాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
హైదరాబాద్ చుట్టుపక్కన ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు గెలిచింది. ఐదు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్ వంటి చోట్ల బీఆర్ఎస్ భారీ విజయాలు నమోదు చేయాల్సి ఉంది. కానీ ఆయా నియోజకవర్గాల్లో డిపాజిట్లు వస్తాయనే ధైర్యం కూడా ఎవరు చేయలేపోయారు. సర్వే సంస్థల్లో ఒకటి అయిన యాక్సిస్ మై ఇండియా బీఆర్ఎస్కు కేవలం పదమూడు శాతం ఓట్లు మాత్రమే వస్తాయని అంచనా వేయడం గమనార్హం. ఓటింగ్ ఈ స్థాయికి పడిపోతే బీఆర్ఎస్ భూస్థాపితమైనట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు చాలా చోట్ల గట్టి పోటీనే ఇచ్చింది. ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతలోనూ 39 అసెంబ్లీ సీట్లు సాధించడం విశేషం. కానీ ఐదు నెలల్లోనే బీఆర్ఎస్ మరీ ఇంత ఘోరంగా పతనం కావడం మాములు విషయం కాదు. రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేయడానికి తమ వంతు ప్రయత్నం చేశాయి. రాను రాను ఆ రెండు పార్టీలను కేసీఆర్, కేటీఆర్ తట్టుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయనే దానికి బీఆర్ఎస్ నిదర్శనంగా నిలుస్తున్నది.