రాజస్థాన్ లో రాజకీయం రంజుగా మారుతోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ పడుతుండటంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసారు రాహుల్ గాంధీ. దాంతో రాజస్థాన్ లో ముఖ్యమంత్రి మార్పు ఖాయమైంది. రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు నాయకులు ఉన్నారు. అయితే అందులో సచిన్ పైలట్ వైపు రాహుల్ గాంధీ మొగ్గు చూపుతుండటంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.
సచిన్ పైలట్ పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 92 మంది నేరుగా స్పీకర్ దగ్గరకు చేరుకొని తమ రాజీనామా లేఖలను ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్టానం షాక్ అయ్యింది. సచిన్ పైలట్ ను తదుపరి ముఖ్యమంత్రిని చేస్తే తమ రాజీనామాలు వెనక్కి తీసుకునేది లేదని , ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేసారు. సచిన్ పైలట్ స్థానంలో అశోక్ గెహ్లాట్ వర్గమైన సీపీ జోషి లేదా పీసీసీ ప్రెసిడెంట్ గోవింద్ సింగ్ లలో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.