కాకతీయ మెడికల్ స్టూడెంట్ దారావత్ ప్రీతి మృతి కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సైఫ్ వేధించడమే కాకుండా మా కూతురును హత్య చేసి ఆత్మహత్య చేసుకుందని నమ్మిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేస్తున్నారు ప్రీతి తల్లిదండ్రులు. అలాగే ప్రీతి పై ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని వాదించిన కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ , HOD లు దర్యాప్తును తప్పుదారి పట్టించారని పోలీసులు ఒక నిర్దారణకు వచ్చిన విషయం తెలిసిందే.
సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తేల్చారు. అయితే ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించిన గదిలో మిడాజోలం , పెంటా నోల్ అనే మత్తు ఇంజెక్షన్ వయల్స్ పడి ఉన్నట్లు దర్యాప్తు లో తేలగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం ప్రీతి శరీరంలో ఎలాంటి విషాలు లేవని తేలడం సంచలనంగా మారింది.
కేసు దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దానికి తోడు ప్రతిపక్షాలు కూడా చనిపోయిన ప్రీతికి వైద్యం పేరుతో 5 రోజుల పాటు డ్రామాలాడారని ఆరోపిస్తున్నాయి. ప్రీతి శరీరంలో ఎలాంటి విషాలు లేకపోతే ఆమె ఎలా మరణించింది ? ఎప్పుడు మరణించింది ? చంపేసి ఆత్మహత్య నాటకం ఆడారా ? తదితర ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సమగ్ర దర్యాప్తు సాగితే కానీ తెలీదు.